భారత్ లో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 6కి చేరింది. గత నెలలో కేరళలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ ముగ్గురూ వైరస్ కు ప్రధానకేంద్రమైన చైనాలోని వూహాన్ సిటీ నుంచి వచ్చినవాళ్లే.
అయితే సోమవారం(మార్చి-2,2020)దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తికి,ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. రాజస్థాన్ పర్యటనకు వచ్చిన ఓ ఇటలీ దేశస్థుడికి కూడా కరోనా సోకినట్లు సోమవారం నిర్థారణ అయింది. దీంతో భారత్ లో మొత్తం కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య ఆరుకి చేరింది.
వైరస్ సోకిన వారిని ఐసొలేషన్ వార్డుల్లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వారు ఎవరెవరిని కలిశారు,వారితో కలిసి ప్రయాణించిన వారందిరినీ గుర్తించి వారిని హాస్పిటల్స్ కు రప్పించి కరోనా టెస్టులు చేపించే పనిలో అధికారులు ఉన్నారు. మరోవైపు ఇప్పటికే భారత్ లోని అన్ని రాష్ట్రాలు దీని పట్ల అలర్ట్ గా ఉన్నాయి. భారత ప్రభుత్వం కూడా కరోనా సోకిన దేశాల నుంచి ఎవరూ బారత్ లోకి అడుగుపెట్టుకుండా ఇప్పటికే జారీ చేసిన వీసాలను కూడా రద్దు చేసింది.
హైదరాబాద్,ఢిల్లీలో సోమవారం కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో టెన్షన్ నెలకొంది. కరోనా వైరస్(కోవిడ్-19) పై ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిపై అధికారులతో సమీక్షించానని ట్విట్టర్‌లో ప్రధాని తెలిపారు. కరోనా నియంత్రణకు వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ర్టాలు కలిసికట్టుగా సమన్వయంతో పని చేయాలన్నారు. విదేశాల నుంచి వచ్చే వ్యక్తులకు ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి.. సరైన ట్రీట్మెంట్ అందించేందుకు రెడీగానే ఉన్నామని మోడీ తెలిపారు. కాబట్టి కరోనా వ్యాప్తి పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మోడీ స్పష్టం చేశారు.
చైనాలో కరోనా మృతుల సంఖ్య దాదాపు 3వేలకు చేరింది. రోజురోజుకి కరోనా మృతుల సంఖ్య పెరిగిపోతుంది. మరోవైపు చైనా తర్వాత దక్షిణకొరియా,ఇటలీలో,ఇరాక్ లో కరోనా విజృంభణ అధికస్థాయిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90వేలమంది కరోనా సోకి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు