IIT Baba Arrest : ఐఐటీ బాబా అరెస్ట్.. పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటే..

అవసరమైత బాబాను మరోసారి పిలిచి విచారిస్తామన్నారు.

IIT Baba Arrest : మహాకుంభమేళా ద్వారా ఫేమస్ అయిన ఐఐటీ బాబా (బాబా అభయ్ సింగ్) గుర్తున్నాడు కదూ. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోతుందని జోస్యం చెప్పి నవ్వులపాలైన ఆ బాబా.. మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఐఐటీ బాబాను జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఓ హోటల్‌లో గంజాయి సేవిస్తూ పోలీసులకు కనిపించాడు ఐఐటీ బాబా. బాబా ఆత్మహత్య చేసుకుంటున్నాడని తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. వెంటనే హోటల్ కి వెళ్లగా బాబా గంజాయి తీసుకుంటూ కనిపించాడన్నారు. బాబాను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత బెయిల్ పై విడిచిపెట్టారు. అతడి దగ్గర చాలా తక్కువ మొత్తంలో గంజాయి లభించడమే ఇందుకు కారణం.

Also Read : ఈ బంగారం ధరలకు మళ్లీ ఏమైంది? ఎందుకిలా జరుగుతోంది? నిపుణులు ఏమంటున్నారు?

”జైపూర్‌లోని ఓ హోటల్‌లో ఉన్న బాబా.. ఆత్మహత్య చేసుకోవచ్చని మాకు సమాచారం వచ్చింది. వెంటనే మేము బాబా ఉంటున్న హోటల్‌ కి వెళ్లాం. మేము బాబాని ప్రశ్నించాము. గంజాయి తీసుకున్నట్లు అతడు ఒప్పుకున్నాడు. ఇంకా నా దగ్గర కొంత గంజాయి ఉందని అతడు చెప్పాడు. ఆత్మహత్య చేసుకోనున్నారు అనే విషయంపై బాబాను మేము ప్రశ్నించాము. అందులో నిజం లేదన్నాడు. ఆత్మహత్య చేసుకుంటున్నాననే విషయాన్ని గంజాయి మత్తులోనే చెప్పి ఉండొచ్చన్నాడు” అని పోలీసులు వెల్లడించారు.

అయితే, గంజాయి కలిగి ఉండటం నేరం అని, ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద బాబాను అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు. తాము బాబాను విచారించామన్నారు. కొద్ది మొత్తంలోనే గంజాయి సేవించాడని గుర్తించి బెయిల్‌పై విడిచి పెట్టామని పోలీసులు చెప్పారు. అవసరమైత బాబాను మరోసారి పిలిచి విచారిస్తామన్నారు.

అరెస్ట్ విషయంపై బాబా మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతానికి దీని గురించి చెప్పడానికి ఏమీ లేదన్నాడు. ఇవాళ తన పుట్టిన రోజు అని తెలిపాడు. పుట్టినరోజున సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని వివరించాడు.