నేను జిలేబి తింటే ఢిల్లీలో కాలుష్యం పెరిగిందా: గంభీర్

కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన కాలుష్యం అంశంపై సమావేశానికి గౌతం గంభీర్ రాలేదు. దీంతో గంభీర్ కనుబడుట లేదంటూ ఢిల్లీ వీధుల్లో పోస్టర్లు కలకలం రేపాయి. అదే సమయంలో వీవీఎస్ లక్ష్మ‌ణ్‌తో పాటు గౌతీ జిలేబీ తింటున్న ఫొటో ఒకటి వైరల్ గా మారింది. దీంతో గంభీర్ సమావేశానికైతే రాలేకపోయాడు కానీ, జిలేబీలు తినడానికి వెళ్తున్నాడంటూ కామెంట్లు వినిపించాయి. 

వీటిపై స్పందించాలంటూ మాజీ క్రికెటర్‌ను మీడియా అడిగిన ప్రశ్నకు తెలివిగా తప్పించుకున్నాడు గంభీర్. ‘నేను జిలేబి తినడం వల్లనే ఢిల్లీలో కాలుష్యం పెరిగిందా. అలా అయితే చెప్పండి. ఇక నేను జిలేబీ తినడమే మానేస్తా. 10నిమిషాల్లోనే నన్ను ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టేశారు. ఈ కష్టమేదో ఢిల్లీ కాలుష్యం నివారించడంపై ఫోకస్ చేస్తే స్వేచ్ఛగా గాలి తీసుకోవచ్చు’ అని చెప్పుకొచ్చాడు. 

పార్లమెంటరీ ప్యానెల్ గాలి కాలుష్యంపై శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి గౌతం గంభీర్ రాకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విమర్శలకు దిగింది. దానిని సర్ది చెప్పుకునే ప్రయత్నంలో గౌతం గంభీర్ పనిని చూడాలని మీటింగ్ లకు వచ్చామా లేదా అనేది అనవసరమంటూ విమర్శలకు వివరణ ఇచ్చాడు.