Jammu and Kashmir Voting
జమ్మూకశ్మీర్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే క్యూలో నిలబడి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తరువాత మళ్లీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. నేడు జరుగుతున్న మొదటి దశ ఎన్నికల్లో 24 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 24 స్థానాలకు 219 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
మొదటి దశలో పాంపోర్, త్రాల్, పుల్వామా, రాజ్‌పోరా, జైనాపోరా, షోపియాన్, డీహెచ్ పోరా, కుల్గాం, దేవ్‌సర్, డూరు, కోకెర్‌నాగ్ (ఎస్‌టీ), అనంత్‌నాగ్ వెస్ట్, అనంత్‌నాగ్, శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరా, షాంగస్-అనంతనాగ్ ఈస్ట్, పహల్‌గామ్, ఇందర్వాల్, కిష్త్వార్, పద్దర్-నాగ్సేని, భదర్వా, దోడా, దోడా వెస్ట్, రాంబన్, బనిహాల్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.
మొదటి దశ ఎన్నికల్లో భాగంగా 3,276 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొదటి దశ ఎన్నికల కోసం విధుల్లో 14,000 మందికి పైగా పోలింగ్ సిబ్బంది ఉన్నారు. ఇవాళ భాగంగా 23,27,580 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది.
వారిలో 11,76,462 మంది పురుషులు, 11,51,058 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. 302 అర్బన్ పోలింగ్ స్టేషన్లు, 2,974 గ్రామీణ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ప్రిసైడింగ్ అధికారితో సహా నలుగురు ఎన్నికల సిబ్బంది ఉంటారు. వేర్పాటువాదం ఎక్కువగా ఉన్న పుల్వామా, అనంత నాగ్, సోఫియా, కుల్గాం జిల్లాల్లో తొలి దశలోనే ఓటింగ్ జరుగుతోంది. ప్రతి పోలింగ్ బూత్ కి మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో ఓటర్లు ఓటింగ్ హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు మోదీ పిలుపునిచ్చారు. పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లోని ఓటర్లంతా పెద్ద సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని అన్నారు.
Pagers Explode: పేజర్ల పేలుళ్ల కలకలం.. తొమ్మిది మంది మృతి, మరో 2,800 మందికి గాయాలు