Pagers Explode: పేజర్ల పేలుళ్ల కలకలం.. తొమ్మిది మంది మృతి, మరో 2,800 మందికి గాయాలు

మొబైల్ ఫోన్లు రాని రోజుల్లో సమాచారాన్ని తెలపడానికి వాడిన పరికరాలను పేజర్లు అంటారు.

Pagers Explode: పేజర్ల పేలుళ్ల కలకలం.. తొమ్మిది మంది మృతి, మరో 2,800 మందికి గాయాలు

Updated On : September 18, 2024 / 7:43 AM IST

లెబనాన్‌లో పేజర్ల పేలుళ్లు కలకలం రేపాయి. పేలుళ్ల ధాటికి తొమ్మిది మంది మృతి చెందగా, మరో 2,800 మందికి పైగా గాయపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. లెబనాన్ రాజధాని బేరూత్‌తో పాటు దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ పేలుళ్లు జరిగాయి.

ఈ పేలుళ్లలో లెబనాన్‌లోని తమ రాయబారి మొజ్తాబా అమానీ కూడా గాయపడ్డారని ఇరాన్ మీడియా తెలిపింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఈ పేలుళ్లు సంభవించాయి. సాధారణంగా పేజర్లను ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా సభ్యులు సమాచారాన్ని బదిలీ చేసుకోవడానికి వాడుతున్నారు. మొబైల్ ఫోన్లను హ్యాకింగ్ చేసే ప్రమాదం ఉండడంతో వారు పేజర్లను వాడుతున్నారు.

ఈ పేజర్లు హిజ్బుల్లాలోని పలు యూనిట్లకు చెందిన సభ్యులు, కంపెనీలకు చెందినవని హిజ్బుల్లా ప్రకటించింది. ఈ పేలుళ్లకు కారణం ఇజ్రాయెల్ అని హిజ్బుల్లా అంటోంది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతోంది. ఈ పేలుళ్లపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించడం లేదు.

ఈ పేలుళ్లు జరగడానికి కొన్ని గంటల ముందు ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఓ ప్రకటన చేస్తూ.. తమ దేశ ఉత్తర భాగంలో హిజ్బుల్లా సభ్యుల దాడులను ఆపడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపింది. అలాగే, నిర్వాసితులను వెనక్కు తీసుకురావడం కూడా తమ యుద్ధ లక్ష్యమని చెప్పింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దుల్లో తరుచూ కాల్పులు చోటుచేసుకుంటున్నాయి.

పేజర్లు అంటే?
మొబైల్ ఫోన్లు రాని రోజుల్లో సమాచారాన్ని తెలపడానికి వాడిన పరికరాలను పేజర్లు అంటారు. ఎవరికి సమాచారం అందించాలనుకుంటున్నామో వారికి మెసేజ్ పంపాలని పేజర్ల సెంటర్‌కు మొదట కాల్‌ చేసి చెప్పేవారు. దీంతో ఆ సెంటర్‌లోని వ్యక్తి సంబంధిత వ్యక్తి వద్ద ఉండే పేజర్‌కు మెసేజ్ పంపుతారు.

ఆ తర్వాత ఆ సందేశాన్ని చూసుకున్న వ్యక్తి తనకు సమాచారం పంపిన వారికి పబ్లిక్‌ టెలిఫోన్‌ బూత్‌ నుంచి ఫోన్ చేసి మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ సైబర్‌ దాడి చేసి పేజర్లలోని లిథియం బ్యాటరీలను వేడెక్కేలా చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే వేలాది పేజర్లు ఒక్కసారిగా పేలిపోయినట్లు హిజ్బుల్లా అనుమానిస్తోంది.

sunita williams: సునీతా విలియమ్స్‌ను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ఏం చేస్తుందో తెలుసా?