దురాక్రమణ కాంక్షతో రగిలిపోతూ పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ దేశం చైనాకు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే చైనాపై భారత్ డిజిటల్ స్ట్రైక్ చేసింది. చైనాకి చెందిన యాప్ లను పెద్ద సంఖ్యలో బ్యాన్ చేసింది. దీంతో చైనాకు వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇప్పుడు ఇతర దేశాలు సైతం చైనాకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా జపాన్, చైనాకి బిగ్ షాక్ ఇచ్చింది. భారత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశానికి చెందిన కంపెనీలు.. చైనా నుంచి భారత్ కు తరలిస్తే వాటికి రాయితీలు ఇస్తామని జపాన్ ప్రకటించింది.
చైనా నుంచి భారత్, బంగ్లాదేశ్‌లకు తరలించే తమ కంపెనీలకు ప్రోత్సహకాలు ఇవ్వాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆసియాన్ దేశాలన్నింటిలోనూ తమ దేశానికి చెందిన సంస్థలు విస్తరించాలన్న ఉద్దేశంతో ఈ రాయితీల కోసం బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసింది. 2020 –21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఆసియాన్ ప్రాంతంలో కంపెనీల విస్తరణకు ప్రోత్సహించాలని 23వేల 500 కోట్ల యెన్‌లు (22.1 కోట్ల డాలర్లు) కేటాయించింది.
https://10tv.in/covid-vaccination-not-expected-until-middle-of-next-year-who/
చైనాలో ఉన్న సంస్థలు ఏమైనా తమ ప్రొడక్షన్ యూనిట్లను భారత్ లేదంటే బంగ్లాదేశ్‌కు తరలిస్తే భారీగా రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా నిక్కీ ఏసియాన్ రివ్యూ నివేదిక వెల్లడించింది. ఔషధ, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని ఆసియా దేశాలన్నింటికీ విస్తరించాలన్నదే జపాన్ ప్రభుత్వం లక్ష్యం. ప్రస్తుతం జపాన్‌కి చెందిన ఉత్పత్తి ప్లాంట్లు అత్యధికంగా చైనాలోనే ఉన్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో వాటి నుంచి సరఫరా ఆగిపోయింది.
కరోనా వైరస్ వ్యాప్తికి చైనాయే కారణమని ప్రపంచమంతా వేలెత్తి చూపిస్తున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి కంపెనీలను తరలిస్తే జపాన్ రాయితీలు ఇస్తామనడం చర్చనీయాంశమైంది. అందులోనూ భారత్‌కి తరలిస్తే ప్రోత్సహాకాలు ఇవ్వాలనుకోవడంతో మన దేశంలో పెట్టుబడులు పెరుగుతాయన్న ఆశలు చిగురిస్తున్నాయి.
సరిగ్గా భారత్-జపాన్ సమ్మిట్ కు వారం రోజుల ముందు జపాన్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. జపాన్ ఆర్థిక, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది. నమ్మకమైన సప్లయ్ చైన్స్ విషయంలో ఒకరికొకరు సహకరించుకుందాం అని భారత్, జపాన్, ఆస్ట్రేలియా ఓ నిర్ణయానికి వచ్చాయి. ఆ వెంటనే జపాన్ భారత్ కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని షింజో అబే.. సెప్టెంబర్ 10వ తేదీన వర్చువల్ సమ్మిట్ లో పాల్గొననున్నారు.
Acquisition and Cross Servicing Agreement మీద ఇరు దేశాలు సంతకం చేయనున్నారు. దీని ప్రకారం రెండు దేశాలకు చెందిన మిలటరీ సర్వీసులు లాజిస్టిక్స్ షేర్ చేసుకోవచ్చు. గత జూన్ లో ఆస్ట్రేలియాతో భారత్ ఇలాంటి ఒప్పందమే చేసుకుంది. భారత్, జపాన్ దేశాలకు చైనాతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రికత్తలు ఉన్నాయి. ఇదే సమయంలో రెండు దేశాల అధినేతలు భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అదే రోజున మాస్కోలో ఉంటారు. చైనా కౌంటర్ పార్ట్ వాంగ్ యితో ఆయన భేటీ కావాల్సి ఉంది.
చైనా దురాక్రమణ వైఖరితో చాలా దేశాలు విసిగిపోయాయి. చైనా పేరు ఎత్తితే చాలు కస్సుమంటున్నాయి. ఆ దేశానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో చైనా నుంచి తమ కంపెనీలను తరలించాలని పలు దేశాలు యోచిస్తున్నాయి. పలు దేశాలు చైనా వస్తువులు, యాప్స్ పై బ్యాన్ విధిస్తున్నాయి. ఇప్పుడు జపాన్ కూడా అదే ఆలోచనలో ఉంది. జపాన్ నిర్ణయం డ్రాగన్ కు బిగ్ షాక్ అని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే చైనా వస్తువులు, యాప్స్ వాడకంపై వ్యతిరేకత రావడంతో ఆ దేశానికి భారీగానే నష్టం వాటిల్లింది. ఇప్పుడు జపాన్ తీసుకున్న నిర్ణయం చైనా వాణిజ్య వ్యవస్థపై పెను ప్రభావమే చూపనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.