జులై-3న జేఈఈ అడ్వాన్డ్స్ పరీక్ష…ఆ కీలక నిబంధన సవరింపు

JEE Advanced 2021 ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కళాశాలలు ఐఐటీల్లో ప్రవేశానికి జరిగే జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీని గురువారం కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు. ఈ రోజు సాయంత్రి నిర్వహించిన ట్విట్టర్ లైవ్ ద్వారా మంత్రి…జూలై 3న ఆ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జేఈఈ-అడ్వాన్స్‌డ్‌-2021 పరీక్షను ఖరగ్‌పూర్‌ ఐఐటీ నిర్వహిస్తుందని రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ తెలిపారు.

ఇంటర్లో 75 శాతం మార్కులను తప్పనిసరిగా సాధించాలన్న నిబంధనను కూడా ఈ సారి ఎత్తేసినట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. కరోనా నేపథ్యంలో 75 శాతం ఉత్తీర్ణతపై ఈ ఏడాది ఇచ్చిన సడలింపును 2021-22 విద్యాసంవత్సరంలోనూ కొనసాగిస్తున్నట్లు కూడా మంత్రి తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో jeeadv.ac.in. వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

కరోనా నేపథ్యంలో గతేడాది జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణ సాధించి, అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరు కాలేక పోయిన వారు ఈ సారి నేరుగా అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించారు. జేఈఈ మెయిన్-2021 పరీక్ష నూతన షెడ్యూల్ ను కేంద్రం ఇటీవల వెల్లడించింది. నూతన షెడ్యూల్ వివరాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు మొదటి జేఈఈ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మరో మూడు సార్లు పరీక్షను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. పరీక్ష అనంతరం నాలుగైదు రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామన్నారు.