పుల్వామా ఉగ్రదాడి సుత్రధారి సంస్థ జైషే మొహమ్మద్ భారత్‌లో మరో భారీ కుట్రకు సిద్దమవుతుందా? ఎన్నికల వేళ వినిపిస్తున్న ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ఈ మేరకు జైషే మొహమ్మద్ విడుదల చేసినట్లుగా చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ నిఘా వర్గాల సమాచారం మేరకు.. ఎన్నికల వేళ దేశంలో భారీ పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
చర్చ్‌లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్‌లలో బాంబు దాడులు చేస్తామని జైషే మహ్మద్ ఓ లేఖ విడుదల చేసినట్లు తెలుస్తుంది. రాజకీయ నాయకులే టార్గెట్‌గా రోడ్‌షోలు, బహిరంగ సభలో పేలుళ్లకు ఉగ్రవాదులు పాల్పడవచ్చునని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలో ఉత్తరాది పోలీసులు అప్రమత్తం అవగా.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌లను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.
ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బాంబు దాడులు చేయబోతున్నట్లు హెచ్చరించారు. అలాగే మే 13న షామ్లి, బాగ్‌పట్, మీరట్, గాజ్రోలా, ఘజియాబాద్, ముజఫర్‌నగర్ రైల్వేస్టేషన్‌లలో.. మే 16న అయోధ్యలోని రామజన్మభూమిలో పేలుళ్లు జరుపుతామంటూ లేఖలో ఉగ్రవాదులు చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై యాంటీ టెర్రర్ స్క్వాడ్ దర్యాప్తు చేపట్టింది. ఇటీవల శ్రీలంకలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఈ లేఖను భద్రత బలగాలు సీరియస్‌గా తీసుకుని సెక్యురిటీని కట్టుదిట్టం చేశాయి.