జేఎన్‌యూలో విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా రాత్రికి రాత్రే విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. జేఎన్‌యూలో హింస ఘటనకు వ్యతిరేకంగా విద్యార్థులంతా ఆందోళనను ఉధృతం చేశారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అహ్వాడ్ విద్యార్థులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. వారితోపాటే కూర్చొని డిమాండ్లపై చర్చిస్తున్నారు. ‘జేఎన్‌యూ విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లబోతున్నాను. విద్యార్థులు ఎప్పుడైతే ఆందోళన చేస్తారో ఏదైనా సీరియస్ ఇష్యూ ఉంటుందని తప్పక అర్థం చేసుకోవాలి’ అని ఆయన అన్నారు.
జేఎన్ యూలో హింసను తీవ్రంగా ఖండిస్తూ విద్యార్థులంతా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళన ప్రారంభమైనప్పటి నుంచి కొంతమంది విద్యార్థుల బృందాలు కొవ్వొత్తుల ప్రదర్శనతో జేఎన్ యూ విద్యార్థులకు సంఘీభావాన్ని తెలిపారు. ముంబైలోని వివిధ కాలేజీలకు చెందిన యువ విద్యార్థులంతా కలిసి గేట్ వే ఇండియా సమీపంలోని తాజ్ మహాల్ ప్యాలెస్ హోటల్ దగ్గర నినాదాలతో హోరెత్తించారు.
మరోవైపు జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావంగా బీజేపీ కార్యాలయం బయట NCP కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, జేఎన్ యూలో ఆదివారం (జనవరి 4,2020) అర్ధరాత్రి సమయంలో ముసుగులు ధరించిన 50మంది గుర్తు తెలియని వ్యక్తులు క్యాంపస్‌లోకి చొరబడి.. విద్యార్థులు, ఫ్యాకల్టీలపై దాడికి పాల్పడ్డారు. అఖిల్ భారతీయ విద్యా పరిషత్ (ABVP) కార్యకర్తలే ఈ దాడులకు పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.