RAHUL GANDHI ఏడాది క్రితం మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరి కమల్ నాథ్ సర్కార్ కూల్చిన జ్యోతిరాధిత్య సింధియా వ్యవహాంపై ఇవాళ రాహుల్ గాంధీ మౌనం వీడారు. తన కోటరీలో ముఖ్యమైన వ్యక్తిగా ఉండే జ్యోతిరాధిత్య కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడంపై ఇప్పటివరకు స్పందించని రాహుల్ తాజాగా మౌనం వీడారు.
సోమవారం యూత్ కాంగ్రెస్(IYC)నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ సందర్భంగా యూత్ వింగ్ కార్యకర్తలతో రాహుల్ మాట్లాడుతూ..సహనం,సిద్దాంతానికి కాంగ్రెస్ ఎప్పుడూ విలువనిచ్చిందన్నారు. తప్పకుండా నువ్వు మధ్యప్రదేశ్ సీఎం అవుతావు..పార్టీ మారవద్దు అని తాను స్వయంగా జ్యోతిరాధిత్యసింధియాకు సలహా ఇచ్చానని రాహుల్ అన్నారు. కానీ ఆయన మరో మార్గాన్ని ఎంచుకున్నారన్నారు.
ఒకవేళ జ్యోతిరాధిత్య సింథియా కాంగ్రెస్‌లో ఉండి ఉంటే, ఇప్పుడు ఆయన సీఎం అయ్యేవారని, కానీ బీజేపీలో చేరి, బ్యాక్ బెంచర్‌గా మారిపోయారని రాహుల్ ఎద్దేవా చేశారు. రాసిపెట్టుకోండి.. అక్కడ ఆయనెప్పుడూ సీఎం కాలేరు. సీఎం పదవి కావాలంటే ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరితేనే సాధ్యమవుతుందని రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సిద్ధాంతాలతో పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని, భయపడవద్దు అని రాహుల్ యువ పార్టీ కార్యకర్తలకు హితువు పలికారు.