K Annamalai: ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మం వ్యాఖ్యలపై అదే రీతిలో అన్నమలై కౌంటర్

తమిళనాడు అధికార పార్టీ డీఎంకేని ఆయన డెంగీ, మలేరియా, కోసుగా అభివర్ణించారు.

Annamalai

K Annamalai- Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై ఇటీవల తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలై మరోసారి స్పందించారు. సనాతన ధర్మం మలేరియా, డెంగీ వ్యాధుల లాంటిదని, దాన్ని నిర్మూలించాల్సిందేనని ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ చేసిన విషయం విదితమే.

దీనిపై ఇవాళ అన్నమలై ఓ వీడియో రూపంలో మాట్లాడారు. తమిళనాడు అధికార పార్టీ డీఎంకేని ఆయన డెంగీ, మలేరియా, కోసుగా అభివర్ణించారు. తమిళనాడు నుంచి దేన్నైనా నిర్మూలించాలని అనుకుంటే.. అది డీఎంకే మాత్రమేనని చెప్పారు. అన్ని మతాల కంటే ముందుగానే సనాతన ధర్మం ఉనికిలో ఉందని అన్నారు.

మానవులే దేవుళ్లని సనాతన ధర్మం చెబుతుందని తెలిపారు. జీవరాశులు దేవుడిలా జీవించడం గురించి మాట్లాడుతుందని అన్నారు. సనాతన ధర్మంలో ఎవరైనా వివక్షను తీసుకొస్తే, మరో వ్యక్తి వచ్చి దాన్ని సంస్కరిస్తాడని చెప్పారు. స్వామి దయానంద సరస్వతి, స్వామి సహజానంద ఇటువంటి గొప్ప కార్యాలే చేశారని తెలిపారు.

ఉదయనిధి స్టాలిన్ మాత్రం మొత్తం సనాతన ధర్మాన్నే నిర్మూలించాలని మాట్లాడుతున్నారని చెప్పారు. దీన్ని బట్టి ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కు సనాతన ధర్మం గురించి ఏమి అర్థం చేసుకున్నారో తెలుస్తోందని అన్నారు.

Sanatana Dharma Row: డీఎంకేకు షాక్.. సనాతన ధర్మ వివాదంపై ఉదయనిధిని తప్పుపట్టిన కాంగ్రెస్