Kamal Haasan: కన్నడ భాషపై కాంట్రవర్సీ కామెంట్స్.. స్పందించిన కమల్ హాసన్.. మరోసారి కీలక వ్యాఖ్యలు..

చెన్నైలో తాను ఇబ్బందులు పడ్డప్పుడు.. కర్నాటక తనకు మద్దతుగా నిలిచిందని కమల్ గుర్తు చేశారు.

Kamal Haasan: కన్నడ భాషపై కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలు ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేశాయో తెలిసిందే. దీనిపై రచ్చ రచ్చ జరుగుతోంది. కమల్ హాసన్ పై కన్నడిగులు భగ్గుమంటున్నారు. కమల్ సారీ చెప్పాలని డిమాండ్లు చేస్తున్నారు. లేదంటే కమల్ సినిమాను బహిష్కరిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో తన తాజా చిత్రం థగ్ లైఫ్ ప్రమోషనల్ ఈవెంట్ లో కమల్ హాసన్ ఈ వివాదంపై స్పందించారు. కన్నడ భాషపై తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారాయన.

కన్నడ భాష గురించి తాను చేసిన వ్యాఖ్యలు ప్రేమతో చేసినవని కమల్ అన్నారు. అంతేకాదు ప్రేమ ఎన్నడూ క్షమాపణ చెప్పదన్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు.  భాషా చరిత్ర గురించి ఎంతోమంది చరిత్రకారులు తనకు నేర్పించారని తెలిపారు. అయితే, భాష గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదన్న కమల్.. ఇది తనకు కూడా వర్తిస్తుందన్నారు.

తమిళనాడు అరుదైన రాష్ట్రం, ప్రతీ ఒక్కరిని మిళితం చేసుకునే తత్వం ఉంటుందన్నారు కమల్. ఈ సందర్బంగా ఆయన ఎంజీ రామచంద్రన్, రామసామి రెడ్డియార్, జయలలిత గురించి కమల్ ప్రస్తావన తెచ్చారు. ”ఓ ‘మేనన్‌’ (ఎంజీ రామచంద్రన్‌) ముఖ్యమంత్రిగా చేశారు. ఓ ‘రెడ్డి’ (ఒమందూర్‌ రామసామి రెడ్డియార్‌) సీఎం అయ్యారు. మైసూర్‌ సంస్థానంలో పని చేసిన నరసింహన్‌ రంగచారి మనవరాలు (జయలలిత) కూడా ముఖ్యమంత్రి అయ్యారు” అని కమల్ అన్నారు.

ఇక, చెన్నైలో తాను ఇబ్బందులు పడ్డప్పుడు.. కర్నాటక తనకు మద్దతుగా నిలిచిందని కమల్ గుర్తు చేశారు. మీరు ఎక్కడికీ వెళ్లొద్దు, మేం ఆశ్రయం కల్పిస్తామని అన్నారని చెప్పారు. భాషపై లోతైన చర్చను చరిత్రకారులకు, పురావస్తు శాస్త్రవేత్తలు, భాషా నిపుణులకు వదిలేద్దామన్నారు కమల్ హాసన్.

Also Read: తెలంగాణ గద్దర్ అవార్డుల్లో అదరగొట్టిన లక్కీ భాస్కర్, కల్కి, 35 ఇది చిన్నకథ కాదు.. ఏయే సినిమాకు ఎన్ని అవార్డులు..

శనివారం చెన్నైలో తన రీసెంట్ మూవీ ‘థగ్‌ లైఫ్‌’ ఆడియో ఈవెంట్‌లో కమల్‌ మాట్లాడుతూ.. కన్నడ భాష కూడా తమిళం నుంచే పుట్టిందని చెప్పారు. అంతే.. ఒక్కసారిగా కాంట్రవర్సీ క్రియేట్ అయ్యింది. దీనిపై కన్నడిగులు భగ్గుమన్నారు. వారి నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కమల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ఆయన పోస్టర్లను తగలబెట్టారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్య నుంచి బీజేపీ నేతల వరకు.. కమల్ వ్యాఖ్యలను ఖండించారు.

కన్నడ భాషకు సుదీర్ఘ చరిత్ర ఉందని చెప్పారు. ఆ విషయాలు కమల్‌కు తెలియకపోవచ్చన్నారు. కన్నడ భాషకు వేల ఏళ్ల చరిత్ర ఉందన్నారు. కమల్ కామెంట్స్ కన్నడిగుల స్వాభిమానాన్ని దెబ్బతీశాయని ఆరోపించారు. కమల్ హాసన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆయన నటించిన “థగ్ లైఫ్” ప్రదర్శనను కర్నాటకలో అడ్డుకుంటామని హెచ్చరించారు.