ఉత్తరప్రదేశ్ లో 8మంది పోలీసులను బలితీసుకున్న గ్యాంగ్ స్టర్, మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అమర్ దూబే హతమయ్యాడు. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి అమర్ దూబేని కాల్చి చంపారు. 8మంది పోలీసుల హత్య కేసులో అమర్ దూబే ప్రధాన నిందితుడు. హిస్టరీ షీటర్ అయిన అమర్ పై రూ.25 వేల రివార్డు ఉంది. అమర్ దూబే, వికాస్ దూబే పర్సనల్ బాడీ గార్డు కూడా. హమీర్‌పూర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో అమర్ దూబే తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. బుధవారం(జూలై 8,2020) ఉదయం అతడిని పట్టుకోవడానికి వెళ్లగా ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో అమర్ దూబే స్పాట్ లోనే చనిపోయాడు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర అదనపు డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
వికాస్ పరారీలో అమర్ హస్తం:
వికాస్ దూబే పరారీలో అమర్ హస్తం ఉందని పోలీసులు చెప్పారు. మరోవైపు దూబే మరో సహచరుడైన ఒకడిని ఫరీదాబాద్ లో అరెస్టు చేశారు. ఈ నగరంలో వికాస్ తన బంధువుల ఇంట్లో దాక్కున్నాడని తెలిసింది. అయితే పోలీసుల రాక గురించి ముందే తెలిసి అక్కడినుంచి పరారయ్యాడు. యూపీ, హర్యానా పోలీసులు సంయుక్తంగా వికాస్ దూబే కోసం మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ గాలిస్తున్నారు.
మరోసారి తప్పించుకున్న వికాస్ దూబే:
మరోవైపు గ్యాంగ్‌స్టార్ వికాస్ దూబే మరోసారి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఎనిమిది మంది పోలీసులను చంపి తప్పించుకు తిరుగుతున్న వికాస్ దూబే.. ఫరీదాబాద్‌లోని బద్కాల్ చౌక్‌లోని శ్రీరామ్ హోటల్‌లో ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో హర్యానా క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన పోలీసులు మంగళవారం(జూలై 7,2020) రాత్రి ఆ హోటల్‌పై దాడి చేశారు. కానీ అతడు అప్పటికే అక్కడి నుంచి పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా అతడు హోటల్ పరిసరాల్లో తిరిగినట్లు రికార్డయ్యింది. దీంతో సీసీటీవీ హార్డ్ డిస్క్‌ను పోలీసులు తమవెంట తీసుకుపోయారు. ఢిల్లీ, గురుగ్రామ్ నగరాల పోలీసుల్ని సైతం అప్రమత్తం చేశారు. అలాగే బిజ్‌నౌర్ పట్టణంలో ఓ కారులో వికాస్ దూబే మంగళవారం కనిపించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ నగరాన్ని పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్నారు. అలాగే సరిహద్దు రాష్ట్రమైన ఉత్తరాఖండ్ పోలీసుల్ని కూడా అప్రమత్తం చేశారు.
8మంది పోలీసులను కాల్చి చంపిన వికాస్ దూబే ముఠా:
జూలై 3వ తేదీన కాన్పూర్‌లో వికాస్ దూబేను పట్టుకోవడానికి పోలీసులు వెళ్లారు. వారిపై వికాస్ దూబే గ్యాంగ్ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులను చనిపోయారు. అప్పటి నుంచి అతడు తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు గాంలింపు చేపట్టారు. వికాస్ దూబేను వెతకడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు సుమారు 100కు పైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వికాస్ దూబే పై రివార్డును రెండున్నర లక్షలకు పెంచారు పోలీసులు. పోలీసులను కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తమ సహచరుల మృతిని పోలీసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతీకారంతో రగిలిపోతున్నారు. వెంటనే వికాస్ దూబేని పట్టుకుని శిక్షించాలని కసిగా ఉన్నారు.
Read Here>>రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బీఆర్.అంబేద్కర్ ఇంటిపై దుండగుల దాడి