ప్రభుత్వాలను కూల్చడంలో…అమిత్ షా అనుభవం నాకు లేదు

మహరాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంపై కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బేరసారాల కోసమే మోడీ సర్కార్ రాష్ట్రపతి పాలన విధించిందన్న కాంగ్రెస్ ఆరోపణలపై కపిల్ సిబల్ వివరణ ఇచ్చారు.

సిబల్ మాట్లాడుతూ…ప్రభుత్వాలను ముక్కలు చేయడంలో హోంమంత్రి అమిత్ షాకి ఉన్నంత అనుభవం నాకు లేదు. ప్రభుత్వాలను పడగొట్టడంలో వాళ్లు ఎంత సిద్ధహస్తులో గోవా, కర్నాటక రాష్ట్రాల్లో చూశాం. ఎమ్మెల్యేల కోసం ఎక్కడ, ఎలా హోటల్ బుక్ చేయాలో అమిత్ షాకి బాగా తెలుసు. గతంలో వాళ్లు ఎలా వ్యవహరించారో మాకు తెలుసు కాబట్టి మా ఆందోళన బయటపెట్టాం అని సిబల్ తెలిపారు.
 
ప్రభుత్వ ఏర్పాటు కోసం సమయం ఇవ్వడంలోనూ శివసేన, ఎన్సీపీ పార్టీల మధ్య పక్షపాతం చూపించారంటూ కపిల్ సిబల్ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీకి గవర్నర్ రెండు వారాల సమయం ఇచ్చారు. మెజారిటీ నిరూపించుకునేందుకు బీజేపీకి గవర్నర్ నాలుగు రోజుల గడువు ఇస్తే సరిపోయేది. కానీ రాష్ట్రపతి పాలన విధించే ఉద్దేశంతో మమ్మల్ని చాలా రోజుల పాటు నిరీక్షించేలా చేశారని సిబల్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు