కర్ణాటక వ్యాప్తంగా బేకరీలు, కన్డిమెంట్ స్టోర్లు బుధవారం టీ, కాఫీ, పాల విక్రయాన్ని నిలిపేశాయి. చిరు వ్యాపారులకు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ జారీచేసిన పన్ను నోటీసులకు నిరసనగా ఈ విధంగా నిరసన తెలిపాయి.
చిరు వ్యాపారులు నలుపు బ్యాడ్జ్‌లు ధరించి ఇవాళ టీ, కాఫీ, పాల విక్రయాన్ని ఆపేశారు. తమను కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అన్యాయంగా లక్ష్యంగా చేసుకుందని వారు ఆరోపించారు.
కార్మిక హక్కుల కార్యకర్త రవి శెట్టి మాట్లాడుతూ.. “ఇవాళ మేము చేతులకు నలుపురంగు బ్యాండ్లు కట్టుకుని నిరసన తెలుపుతున్నాం. ఏ బేకరీలోనూ పాలు అమ్మడం లేదు. నిరసనకు గుర్తుగా కేవలం బ్లాక్ టీ మాత్రమే అందుబాటులో ఉంది” అని చెప్పారు.
ఇతర వాణిజ్య కార్యకలాపాలు సాధారణంగా కొనసాగాయి. కొంతమంది వ్యాపారులు కస్టమర్లకు కేవలం బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ మాత్రమే ఇచ్చారు. జీఎస్టీ నోటీసుల నేపథ్యంలో చిరు వ్యాపారుల్లో అసంతృప్తి పెరుగుతోంది. నోటీసులు వెనక్కి తీసుకోకపోతే నిరసనలు ముమ్మరంగా జరుగుతాయని వ్యాపారులు హెచ్చరించారు.
కాగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇవాళ చిరు వ్యాపారుల ప్రతినిధులతో తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారు. నోటీసులు రావడంతో కర్ణాటక వ్యాప్తంగా చిరు వ్యాపారుల్లో ఆందోళన పెరిగింది. చాలామంది ఇప్పుడు యూపీఐ పేమెంట్లకు ఒప్పుకోవట్లేదు. క్యాష్ మాత్రమే ఇవ్వాలని చెబుతున్నారు.
బెంగళూరు సహా కర్ణాటక వ్యాప్తంగా చాయ్ దుకాణాలు, బేకరీలు, మార్కెట్లోని ఇతర షాపుల్లో “నో యూపీఐ” బోర్డులు కనపడుతున్నాయి. లక్షల రూపాయల నుంచి కోట్ల వరకు పన్నులు విధిస్తారన్న భయంతో వ్యాపారులు ఆందోళన చెందుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాపార సంఘాలు జూలై 25న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపు ఇచ్చాయి. అధిక పన్నులు వసూలు చేస్తున్నారని, ఇష్టం వచ్చినట్టు నోటీసులు ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.