కర్ణాటకలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఉప ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టీ కర్ణాటకపైనే ఉంది.
కర్ణాటకలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఉప ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టీ కర్ణాటకపైనే ఉంది. రాష్ట్రంలోని 11 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం కల్లా ఫలితాలు వెలువడుతాయని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. కౌంటింగ్ కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. యడియూరప్ప ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ రావాలంటే ఆరు స్థానాల్లో బీజేపీ కచ్చితంగా గెలవాల్సిందే. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకి పట్టం కట్టడంతో సీఎం యడియూరప్ప ధైర్యంగా కనిపిస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఎగ్జిట్‌పోల్స్ శాస్త్రీయమైనవి కాదని కొట్టి పారేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ మొత్తం 15 స్థానాల్లో… జేడీఎస్ 12చోట్ల బరిలో ఉన్నాయి. ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నాయకులు టెన్షన్ తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి యడియూరప్ప ధర్మస్థలలోని మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అటు జేడీఎస్ అధినేత దేవెగౌడ షిర్డీ వెళ్లారు. సాయినాథుడిని దర్శించుకున్నారు.
డిసెంబర్ 5 వ తేదీన 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. 66.25 శాతం పోలింగ్ నమోదైంది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలుండటంతో రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగలేదు. దీంతో అసెంబ్లీలో మిగిలిన 222కుగాను మ్యాజిక్ నెంబర్ 112. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. స్పీకర్‌తో పాటు మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా బీజేపీకి మద్దతిస్తున్నారు.
ఇవాళ వెల్లడయ్యే ఉప ఎన్నికల ఫలితాల్లో కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిస్తేనే బీజేపీకి మెజార్టీ ఉంటుంది. లేదంటే యడియూరప్ప సర్కారు మైనార్టీలో పడిపోతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి 66, జేడీఎస్‌కు 34 మంది ఎమ్మెల్యేలున్నారు. 14 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ సభ్యుల రాజీనామాలతో ఇటీవలే కాంగ్రెస్- జేడీఎస్ సర్కారు కూలిపోయింది. ఆ వెంటనే రాజీనామాలు చేసిన సభ్యులను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.