Death
Karnataka Leaders: కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్దరామయ్య, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ప్రముఖ అభ్యుదయ సాహితీవేత్త కె.వీరభద్రప్ప సహా 64 మందిని హతమారుస్తామంటూ వచ్చిన సందేశాలు కలకలం సృష్టిస్తున్నాయి. చావు మీ చుట్టూ దాగుంది, చనిపోవడానికి సిద్ధంగా ఉండండి’ అనే సందేశం కర్ణాటకలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రాణహాని విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ‘సాహిష్ణ హిందూ’ (సహనశీలి హిందువు) అనే పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు ఈ సందేశాలను పంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే దుండగులు ఏ పరిణామాల నుద్దేశించి ఈ సందేశాలు పంపించారనే విషయంపై స్పష్టత రాలేదు.
“మీరు వినాశన మార్గంలో ఉన్నారు. మరణం మీకు చాలా దగ్గరగా ఉంది. మీరు సిద్ధంగా ఉండండి. మరణం మీకు ఏ రూపంలోనైనా రావచ్చు. మీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించండి మరియు మీ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయండి” అని సందేశంలో పేర్కొన్నారు. కాగా ప్రాణహాని బెదిరింపుల సందేశాలపై మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి స్పందిస్తూ ఇలాంటి బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రగతిశీల ఆలోచనాపరుడు, రచయిత కె.వీరభద్రప్పకు, మతతత్వ ధ్రువీకరణపై ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ఇతర రచయితలకు కూడా భద్రత కల్పించాలని కుమారస్వామి అధికార బీజేపీని కోరారు.
Also read:Rahul gandhi : మాయావతికి సీఎం పదవి ఇస్తామని ఆఫర్ చేశాం.. సీబీఐ, ఈడీ భయంతో…
ఉద్యమకారుడు, రచయిత ప్రొఫెసర్ ఎంఎం కలబురిగి పై కాల్పులు జరపడం వంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకూడదని ఆయన అన్నారు. హిజాబ్ వివాదంపై కర్ణాటక రాష్ట్ర హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు నిరసనలు చేపట్టాయి. ఈనేపథ్యంలో హిందూ సంస్థలు దేవాలయాల్లో ముస్లిం వ్యాపారులు విక్రయించే హలాల్ మాంసం, శిల్పాలు, పండ్లను, ముస్లిం డ్రైవర్లను, రవాణా కంపెనీలను నిషేధించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ లు అధికార బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టాయి.
Also read:Bhubaneswar : ఒక బిందెడు నీరు రూ. 1.30 లక్షలు.. సంతానప్రాప్తి కలుగుతుందని విశ్వాసం!