దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14వతేదీ తర్వాత కూడా కొనసాగిస్తే …… రోజుకు 3 గంటల పాటు మద్యం విక్రయాలకు అనుమతించాలని కర్ణాటక రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆలోచిస్తోంది. మద్యానికి అలవాటు పడిన మందుబాబులు అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకోనుంది.
గత నెలలో లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి…మద్యానికి బానిసలైన బాబులు మద్యం లభించక పోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్ధితుల్లో ఏప్రిల్ 14వతేదీ తర్వాత కరోనా లాక్‌డౌన్‌ను పొడిగిస్తే ప్రతీ రోజు ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు రోజుకు 3 గంటల పాటు మద్యం విక్రయించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రతిపాదించారు.
కర్ణాటకలో మార్చి21 నుంచే మద్యం అమ్మకాలు నిషేధించారు. దీంతో మద్యం కోసం వైన్ షాపుల్లో చోరీలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్రానికి మద్యం అమ్మాకాల ద్వారా రూ. 5000 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడది ఆగిపోయింది. ఈ పరిస్ధితి నుంచి గట్టేకేందుకు కూడా కర్ణాటక సర్కారు మద్యం విక్రయించాలని యోచిస్తోంది.
మద్యానికి డిమాండ్ పెరిగిన దృష్ట్యా మూడు గంటలపాటు మద్యం విక్రయించాలని యోచిస్తున్నామని, దీనిపై సీఎం ఎడ్యూరప్ప నిర్ణయం తీసుకుంటారని కర్ణాటక ఎక్సైజ్ శాఖ కమిషనర్ యశ్వంత్ చెప్పారు. ఒక్కసారిగా మద్యం షాపులు, బార్లు తెరిస్తే రద్దీ తట్టుకోవటం కష్టమవుతుందని దశలవారీగా ఎత్తివేయాలను కుంటున్నట్లు ఆయన చెప్పారు.
ప్రభుత్వం అన్ని దుకాణాలను తిరిగి ప్రారంభించటానికి అనుమతించాలని లేదా మైసూర్ సేల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) అవుట్లెట్లను మాత్రమే మద్యం విక్రయించడానికి అనుమతించాలని కొందరు ఎక్సైజ్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మద్యం కొనుగోలు చేసేటప్పుడు మందు బాబులు సోషల్ డిస్టెన్స్ తప్పని సరిగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసినా, కరోనా కేసులున్న ప్రాంతాల్లో మరింత కఠినంగా దిగ్బంధాన్ని కొనసాగించనున్నారు. అందుకే, తాత్కాలిక ఏర్పాటుగా, మద్యం అమ్మకాలకు మూడు గంటల అనుమతినిచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇదిచాలు, మందుబాబులకు కిక్కెక్కడానికి.