NEP 2020: మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కర్ణాటక ప్రభుత్వం పక్కన పడేసింది. ఆ పాలసీని తమ రాష్ట్రంలో అమలు చేయమని తేల్చి చెప్పింది. దానికి బదులుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించి అమలు చేయనుంది. ఈ విషయమై కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఎంసీ సుధాకర్ మంగళవారం వెల్లడించారు.
కలబురగిలో సోమవారం మీడియాతో మంత్రి సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండేళ్ల క్రితం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేశారని, తద్వారా ఉన్నత విద్యలో చదువుకు కొంత సమస్య ఏర్పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారని అన్నారు. అందుకే విద్యార్థుల చదువుకు ఎటు వంటి భంగం కలగకుండా ఉండాలనే విద్యానిపుణుల సభ ఏర్పాటు చేసి సాధక బాధకాలపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇందుకోసం కొత్తగా స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యలో గుణాత్మకత, నైపుణ్యత విషయంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని భావించిన ఆయన.. బోధనలతోపాటు విద్యార్థులకు నైపుణ్యత ముఖ్యమని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఎంసీ సుధాకర్ స్పష్టం చేశారు.