Bus New Rules : ఇకపై బస్సుల్లో ఫోన్లో పాటల సౌండ్ వినిపిస్తే.. అక్కడే దించేస్తారు జాగ్రత్త!

ఇకపై బస్సుల్లో ప్రయాణించే సమయంలో ఫోన్లలో పాటలు, వీడియోలు బయటకు వినిపించేలా ప్లే చేయడం నిషేధం విధించింది కర్నాటక ఆర్టీసీ.. హైకోర్టు ఆదేశాల మేరకు కర్నాటక ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

Bus New Rules : బస్సు జర్నీ చాలామంది బోరుగా ఫీలవుతుంటారు. బస్సుల్లో దూర ప్రయాణాలు చేసేవాళ్లు ఫోన్లలో వీడియోలు, పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటారు. కొంతమంది ఇయర్ ఫోన్లలో పాటలు వింటే.. మరికొందరు బయటకు వినపడేలా మొబైల్ ఫోన్లలో లౌడ్ స్పీకర్ పెట్టి మరి వింటుంటారు. ఇది తోటి ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇకపై బస్సుల్లో ప్రయాణించే సమయంలో ఫోన్లలో పాటలు, వీడియోలు బయటకు వినిపించేలా ప్లే చేయడం నిషేధం విధించింది కర్నాటక ఆర్టీసీ.. హైకోర్టు ఆదేశాల మేరకు కర్నాటక ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

బస్సుల్లో ఎవరైనా ఫోన్లలో వీడియోలు, పాటలు బయటకు వినిపించేలా ప్లే చేస్తే వెంటనే బస్సులో నుంచి కిందికి దింపేస్తారు. బస్సు లోపల ‘శబ్దం అంతరాయం’పై ఆంక్షలు విధించాలని కొరుతూ ఓ పిటిషనర్‌ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. మొబైల్‌లో అధిక సౌండ్‌తో పాటలు, వీడియోలను ప్లే చేయడాన్ని పరిమితం చేయాలని పిటిషన్‌లో కోరారు.

ఈ పిటిషన్‌పై విచారించిన కర్ణాటక హైకోర్టు చర్యలు చేపట్టాలని కేఎస్‌ఆర్టీసీ (KSRTC)ని ఆదేశించింది. అధిక వాల్యూమ్‌తో పాటలు, వీడియోలను ప్లే చేయవద్దని సూచించింది. తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించవద్దని బస్సు ప్రయాణికులకు సూచించాలని ఆదేశాల్లో పేర్కొంది. బస్సు రూల్స్, సూచనలు పాటించని ప్రయాణికులను అధికారులు వెంటనే బస్సులో నుంచి దించేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
Read Also  : RRR: యూట్యూబ్‌కి కూడా అందని మన హీరోల ‘నాటు’ డాన్స్ స్పీడ్!

ట్రెండింగ్ వార్తలు