karnataka polls: కర్ణాటక ఎన్నికలపై దేశ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న మరో చర్చేమిటంటే.. సంకీర్ణ ప్రభుత్వాలు. గత ఎన్నికల్లో మాదిరిగానే.. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే.. మళ్లీ సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడే అవకాశాలున్నాయి. ఇదే మిగతా రాష్ట్రాలకు కూడా ఎగ్జాంపుల్‌గా మారుతుందని.. తప్పనిసరి పరిస్థితుల్లో.. 2 , 3 పార్టీలు కలిసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇందుకు.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులే కారణం. ఇప్పుడు.. కర్ణాటకలో కనిపించబోయే పొలిటికల్ సీనే.. మిగతా స్టేట్స్‌లో ఆఫ్టర్ ఎలక్షన్ పరిస్థితులను డిసైడ్ చేసే అవకాశాలున్నాయ్.
ఎన్నికల విషయంలో.. ఇండియాలో ఏ రాష్ట్రానికి లేని ఓ ప్రత్యేకమైన ట్రాక్ రికార్డ్.. కర్ణాటకకు ఉంది. ఈసారైనా.. కన్నడ ఓటర్లు ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసి ఉంటారా? అన్న ఆసక్తి అంతటా ఉంది. గడిచిన 38 ఏళ్లుగా.. కర్ణాటకలో ఏ ప్రభుత్వమూ.. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదు. అంతేకాదు.. పూర్తి స్థాయిలో పరిపాలన చేసిన సీఎంలు కూడా కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితులే.. కర్ణాటకలో రాజకీయం ఏ స్థాయిలో ఉంటుందో తెలియజేస్తోంది. పూర్తి స్థాయిలో పరిపాలించిన ఈ ముగ్గురు నేతలు కూడా కాంగ్రెస్ సీఎంలే. గడిచిన కొన్నేళ్లుగా.. కర్ణాటకలో వస్తున్న ఫలితాలు, అక్కడ ఏర్పడుతున్న ప్రభుత్వాలను చూస్తుంటే.. మరోసారి సంకీర్ణ ప్రభుత్వంపై చర్చ మొదలైంది. గత ఎన్నికల్లోనే.. కర్ణాటకలో హంగ్ ఏర్పడింది. అప్పుడు.. జేడీఎస్ కింగ్ మేకర్‌గా మారడమే కాదు.. కొన్నాళ్లు కింగ్‌గానూ వ్యవహరించింది. తర్వాత బీజేపీ మొదలుపెట్టిన పొలిటికల్ గేమ్‌లో.. ఆ ప్రభుత్వం కూలి మళ్లీ కమలం పార్టీ అధికారం చేపట్టింది. ఇప్పుడు.. మరోసారి కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం గురించి చర్చ మొదలైంది. ఈసారి రిజల్ట్ ఎలా ఉంటుందో.. ఎవరికీ తెలియదు. కానీ.. కర్ణాటకలో గనక మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే.. దేశంలోని మిగతా రాష్ట్రాల్లోనూ.. హంగ్ వచ్చినప్పుడు సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు అడుగులు ముందుకు పడే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయ్. అప్పుడు.. కాంగ్రెస్, బీజేపీతో పాటు లోకల్ పార్టీలు కూడా కీలకంగా మారే చాన్స్ ఉంది.
వాస్తవానికి.. 1990 నుంచి కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఏస్ వరుసగా పోటీ చేస్తుండటం.. భౌగోళికంగా కర్ణాటకలోని 3 ప్రాంతాల్లో ఈ పార్టీలకు బలమైన పట్టు ఉండటంతో.. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడం లేదు. దాంతో.. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయ్. మైసూర్ ప్రాంతంలో.. జేడీఎస్‌కి గట్టి పట్టు ఉంది. అక్కడ అధిక సంఖ్యలో ఉన్న ఒక్కలింగ సామాజికవర్గం జేడీఎస్‌కు మద్దతుగా ఉంది. ఇక.. నార్త్ కర్ణాటకలో బీజేపీ బలంగా ఉంది. అక్కడ లింగాయత్ నేత యడియూరప్ప.. కర్ణాటకను బీజేపీకి బలమైన కేంద్రంగా మార్చారు. మరోవైపు.. కాంగ్రెస్‌కి కర్ణాటక మొత్తం బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ.. సీట్లు మాత్రం సాధించలేకపోతోంది. అందువల్ల.. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం రివాజుగా మారింది. ఇక.. ఎంత బాగా పరిపాలించినా కర్ణాటక ఓటర్లు.. ఏ పార్టీకి వరుసగా రెండోసారి అధికారం ఇవ్వరని.. వారి డిమాండ్లు తీర్చడం కష్టమనే విశ్లేషణలు కూడా ఉన్నాయ్. మరి.. 38 ఏళ్ల రికార్డును తిరగరాసి.. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందా? లేక పాత సంప్రదాయం ప్రకారమే.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా? అన్నది.. ఆసక్తిగా మారింది.
Also Read: కర్ణాటక ఎన్నికల సక్సెస్ ఫార్ములా.. ఇండియా లెవెల్‌లో సెట్ అయినట్లేనా?
కర్ణాటకలో వచ్చే ఫలితాలే.. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయ్. అక్కడ కనిపించే పొలిటికల్ సీన్.. ఇండియాలోని మిగతా రాష్ట్రాల్లో.. కాంగ్రెస్, బీజేపీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంది. బీజేపీ గెలిస్తే.. కాషాయం వేవ్ ఇంకా కంటిన్యూ అవుతోందని.. కాంగ్రెస్ గెలిచే.. మళ్లీ ఆ పార్టీ స్వింగ్ లోకి వచ్చిందనేలా.. ఒక వేవ్ మొదలవుతుంది. అదే.. రాబోయ జనరల్ ఎలక్షన్లలో.. ఏ రాష్ట్రంలో ఎవరు అధికారం చేపట్టాలన్నది డిసైడ్ చేస్తుంది. దాదాపుగా పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీపై.. ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. ఇక.. కాంగ్రెస్ కూడా ఇప్పుడిప్పుడే బెటరవుతూ వస్తోంది. దాంతో.. అన్ని రాష్ట్రాల్లో కాకపోయినా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదనే చర్చ జరుగుతుంది. అప్పుడు.. కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు వస్తాయ్. ఇప్పుడు.. కర్ణాటకలో కనిపించబోయే సీనే.. మిగతా రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలకు ఓ మార్గం చూపుతాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.
Also Read: డబ్బులు ఇచ్చి ఉండాల్సింది.. కర్ణాటక ఎన్నికలపై మాజీ సీఎం కుమారస్వామి హాట్ కామెంట్స్
ఇప్పటికే.. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ ప్రకటించిన పథకాలు.. దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయ్. ఆ రెండు పార్టీల్లో.. ఏది గెలిచినా.. అదే ఎజెండా.. మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేస్తుందనే చర్చ జరుగుతోంది. అదేవిధంగా.. కర్ణాటకలో హంగ్ వస్తే.. ఆ తర్వాత.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే.. మిగతా రాష్ట్రాల్లోనూ అలాంటి సీనే కనిపించే అవకాశాలు ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న రాష్ట్రాల్లో.. రెండు పార్టీలకు స్పష్టమైన మెజారిటీ గనక రాకపోతే.. అక్కడ కూడా సంకీర్ణ ప్రభుత్వాలకే చాన్స్ ఉంటుంది. ఇందుకు.. కర్ణాటక, మహారాష్ట్ర కంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ మరేవి ఉండవు. కాబట్టి.. రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో కర్ణాటకే ప్రధాన ఎజెండాగా ఉండబోతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. అయితే.. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటే తప్ప.. పొలిటికల్ ఈక్వేషన్స్ పెద్దగా మారే చాన్స్ లేదంటున్నారు.