Karnataka Agenda: కర్ణాటక ఎన్నికల సక్సెస్ ఫార్ములా.. ఇండియా లెవెల్‌లో సెట్ అయినట్లేనా?

కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినా.. బీజేపీ మళ్లీ అధికారం చేపట్టినా.. అక్కడి మ్యానిఫెస్టోలో వాళ్లిచ్చిన హామీలనే.. దేశంలోని మిగతా రాష్ట్రాలపైనా కురిపించే అవకాశముంది.

Karnataka Agenda: కర్ణాటక ఎన్నికల సక్సెస్ ఫార్ములా.. ఇండియా లెవెల్‌లో సెట్ అయినట్లేనా?

Karnataka Agenda: ప్రతి పార్టీకి.. ఓ జెండా ఉన్నట్టే.. ప్రతి ఎన్నికలకు ఓ ఎజెండా ఉంటుంది. ఎలక్షన్ మొత్తం దాని చుట్టే తిరుగుతుంది. అదే.. ఎవరు అధికారంలో ఉండాలో డిసైడ్ చేస్తుంది. కర్ణాటక ఎన్నికలు చూశాక.. ఇండియా లెవెల్‌లో ఓ ఎజెండా సెట్ అయినట్లే అనిపిస్తోంది. అదే.. కర్ణాటక ఎజెండా. వినడానికి కాస్త కన్ఫ్యూజింగ్‌గా ఉన్నా.. విషయం మాత్రం చాలా క్లియర్‌గానే ఉంది. ఇప్పుడు.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినా.. బీజేపీ మళ్లీ అధికారం చేపట్టినా.. అక్కడి మ్యానిఫెస్టోలో వాళ్లిచ్చిన హామీలనే.. దేశంలోని మిగతా రాష్ట్రాలపైనా కురిపించే అవకాశముంది. రెండు నేషనల్ పార్టీలు.. ఇప్పుడు తమ పథకాలనే సక్సెస్ ఫార్ములా (Success Formula)గా భావిస్తున్నాయ్. అందుకే.. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన ఎజెండా.. కర్ణాటకలోనే రెడీ అయిపోయిందంటున్నారు.

కర్ణాటకలో ఇప్పటికి చాలా సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయ్. కానీ.. ఇంతకు ముందెన్నడూ లేనంత హారోహారీ పోరు ఈసారి ఎన్నికల్లోనే కనిపించింది. అందువల్ల.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నది ఆసక్తిగా
మారింది. ఇండియా మొత్తం.. ఇప్పుడు కర్ణాటక వైపే చూస్తోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి.. కాంగ్రెస్ పవర్‌లోకి వస్తుందా.. బీజేపీనే అధికారం నిలబెట్టుకుంటుందా? లేక.. మళ్లీ జేడీఎస్సే.. కింగ్ మేకర్‌ (King Maker)గా మారుతుందా? అనేది ఎంతో ఉత్కంఠగా మారింది. ఎందుకంటే.. గెలుపు కోసం అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. జేడీఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చేలా కనిపించింది. కులాలు, మతాలు, పీఠాల ప్రభావం ఎక్కువగా ఉండే కర్ణాటకలో.. ఈసారి అవినీతి, అభివృద్ధి, ఎమ్మెల్యేల కొనుగోలు, ఉచిత హామీలు, మతం, హిందుత్వం అంశాలే ప్రముఖంగా చర్చకు వచ్చాయ్. ఇక.. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న కర్ణాటకలో.. ఎలాంటి రిజల్ట్ వస్తుందన్నది అతి త్వరలోనే తేలిపోతుంది. అంతకంటే ముందు.. కర్ణాటక ఏ పార్టీ గెలిచినా.. రాబోయే జనరల్ ఎలక్షన్లలో.. కర్ణాటక ఎజెండాకే ప్రాధాన్యత ఉంటుందనే చర్చ.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇదే.. ఇండియన్ పాలిటిక్స్‌లోనూ.. చర్చనీయాంశంగా మారింది.

నిజానికి.. కర్ణాటకలో గత పదిహేనేళ్లుగా నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం లాంటివి అతి పెద్ద సమస్యలుగా ఉన్నాయి. కానీ.. ఎన్నికల ప్రచారంలో అవన్నీ పక్కకెళ్లిపోయాయ్. బజరంగ్దళ్ వివాదంతో.. క్యాంపెయిన్ అంతా.. మతపరమైన అంశాల చుట్టే తిరిగింది. అయినప్పటికీ.. కన్నడ నాట అధికారం కోసం.. పార్టీలు జనాకర్షక పథకాలు ప్రకటించక తప్పలేదు. హిమాచల్ ప్రదేశ్‌లో విజయం తెచ్చిపెట్టిన ఫార్ములానే.. కర్ణాటకలోనూ అమలు చేయాలని.. కాంగ్రెస్ నిర్ణయించడంతో బీజేపీ కూడా ప్లాన్ మార్చిందనే విశ్లేషణలు వినిపించాయ్. అధికారం నిలబెట్టుకునేందుకే.. బీజేపీ కూడా ఉచిత పథకాలను ఎంపిక చేసుకోక తప్పలేదు. అన్నం, అభయం, అక్షరం, ఆరోగ్యం, ఆదాయం, అభివృద్ధి అనే ఆరు అంశాల అజెండాగా.. హామీలు కురిపించింది. అంతకుముందు ఎన్నికల్లో ఉచిత హామీలకు వ్యతిరేకమని ప్రకటిస్తూ వచ్చిన బీజేపీ.. కర్ణాటక ఎన్నికల్లో మాత్రం పాల నుంచి బియ్యం దాకా ఉచితాలు ప్రకటించడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

తాము మళ్లీ అధికారంలోకి వస్తే.. నిరుపేదలకు ఏడాదికి మూడు వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది బీజేపీ. ఉగాది, వినాయక చవితి, దీపావళి పండుగలకు ఫ్రీ సిలిండర్లు అందిస్తామని తెలిపింది. ఇక.. పోషణే పథకం కింద.. ప్రతి రోజూ పేద కుటుంబాలకు అర లీటర్ చొప్పున నందిని పాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా.. రేషన్ కార్డు దారులకు నెలకు ఐదు కిలోల బియ్యం, ఐదు కిలోల చిరుధాన్యాలను.. అటల్ ఆహార్ కిట్ పేరుతో పంపిణీ చేస్తామని చెప్పారు. తిరుపతి (Tirupati), అయోధ్య, కాశీ, రామేశ్వరం, శబరిమలై, కేదార్‌నాథ్‌కు వెళ్లే పేద కుటుంబాలకు 25 వేల దాకా ఆర్థికసాయం అందిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పారు. ఎస్సీ, ఎస్టీ మహిళల పేర్ల మీద 10 వేల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్స్ చేస్తామన్నారు. 10 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, 10 లక్షల ఇళ్ల నిర్మాణానికి.. 5 లక్షల దాకా ఆర్థికసాయం.. ఇలా ఓటర్లను ఆక్టటుకునే హామీలు చాలానే ఉన్నాయ్.

Also Read: గొప్ప జ్యోతిష్యుడిగా చెబుతున్నా సర్వేలన్నీ చెత్త.. కర్ణాటకలో బీజేపీదే విజయం..

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రకటించిన పథకాలు కూడా బాగా ప్రచారంలోకి వచ్చాయ్. అవే పథకాలు హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ని గెలిపించాయ్. వాటితో పాటు కర్ణాటకకు తగ్గట్లుగా డిజైన్ చేసిన మ్యానిఫెస్టో.. రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీశాయ్. గృహలక్ష్మి, గృహజ్యోతి, అన్నభాగ్య, యువనిధి, శక్తి పేరిట.. ఐదు ప్రధాన హామీలను కన్నడ సీమలో విస్తృతంగా ప్రచారం చేసింది కాంగ్రెస్. అధికారంలోకి రాగానే.. తొలి సంతకం ఈ హామీల అమలు కోసమేనని చెప్పారు. గృహలక్ష్మి పథకం కింద ప్రతి కుటుంబంలోని ఓ మహిళకు.. నెల నెలా రెండు వేల రూపాయల ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చారు. గృహజ్యోతిలో పేదలకు ప్రతి నెలా 2 వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామన్నారు. ఇక అన్నభాగ్య పథకం కింద ఉచిత బియ్యం, యువనిధిలో డిగ్రీ చేసిన నిరుద్యోగ యువతకు 3 వేల భృతి, వొకేషనల్ డిగ్రీ చేసిన వారికి 15 వందల సాయం.. రెండేళ్ల పాటు అందజేస్తామని ప్రకటించింది కాంగ్రెస్.

ఉత్తర భారతంలో బీజేపీ రాజకీయం (BJP Politics) ఒకలా ఉంటుంది. కానీ.. దక్షిణాదికి వచ్చేసరికి మాత్రం మొత్తం తీరే మారిపోతుంది. కర్ణాటకలో కనిపించింది కూడా ఇదే. కన్నడ రాజకీయంలో.. బీజేపీ సిద్ధాంతాలను పక్కన పెట్టినట్లే అనిపిస్తోంది. ఊహించని విధంగా కాంగ్రెస్, జేడీఎస్ హామీలు గుప్పించడంతో.. కాషాయ పార్టీ కూడా ఉచిత హామీలు, ఓటర్లను ఆకట్టుకునే పథకాలు ప్రకటించక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రధాని మోదీనే.. బహిరంగంగా ఉచితాలను వ్యతిరేకించినా.. చివరికి కర్ణాటకలో వాటినే ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. దక్షిణాదిలో ఓటర్లను ఆకట్టుకోవాలంటే.. జనాకర్షక పథకాలు ప్రకటించక తప్పదని.. బీజేపీ నేతలే అంటున్నారు. మరోవైపు.. బీజేపీ ఇలా మారేందుకు.. కాంగ్రెస్సే కారణమంటున్నారు పరిశీలకులు. అయితే.. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ ప్రకటించిన పథకాలు, ఇచ్చిన హామీలే.. ఇప్పుడు ఇండియా ఎజెండాగా మారనున్నాయా? అనే చర్చ మొదలైంది.

Also Read: కాంగ్రెస్ నేతలు అంబులెన్సులు దగ్గర ఉంచుకుంటే బెటర్ : బీజేపీ నేత సెటైర్లు..

కర్ణాటకలో బీజేపీ గెలిచినా.. కాంగ్రెస్ విజయం సాధించినా.. అక్కడి మ్యానిఫెస్టోనే.. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఎజెండాగా మార్చేస్తాయనే టాక్ వినిపిస్తోంది. అక్కడ గుప్పించిన హామీలనే.. ఇతర రాష్ట్రాల్లోనూ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా.. మరికొన్ని నెలల్లో తెలంగాణలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే.. కాంగ్రెస్ హైదరాబాద్‌ డిక్లరేషన్ కూడా ఉందంటున్నారు. కర్ణాటకలో యువతకు 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణలోనూ.. 4 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని డిక్లరేషన్‌లో చెప్పింది. అందువల్ల.. రానున్న జనరల్ ఎలక్షన్స్‌లోనూ.. కర్ణాటక ఓటర్లపై గుప్పించిన హామీలనే.. మిగతా రాష్ట్రాల్లోనూ కంటిన్యూ చేసే అవకాశముందనే చర్చ జోరుగా సాగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. కర్ణాటకలో ఏ పార్టీ గెలిచినా.. అదే ఎజెండా.. ఇండియా మొత్తం అమలయ్యే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయ్.