Jithender Reddy: గొప్ప జ్యోతిష్యుడిగా చెబుతున్నా సర్వేలన్నీ చెత్త.. కర్ణాటకలో బీజేపీదే విజయం..

సర్వేలన్నీ చెత్త.. కర్ణాటక ప్రజలు బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇవ్వబోతున్నారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు.

Jithender Reddy: గొప్ప జ్యోతిష్యుడిగా చెబుతున్నా సర్వేలన్నీ చెత్త.. కర్ణాటకలో బీజేపీదే విజయం..

Jithender Reddy: దేశమంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. అయితే ఇప్పటికే వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయి. పూర్తి మెజారిటీతో హస్తం పార్టీ అధికారంలోకి రాబోతోందని అంచనా వేశాయి. కేవలం ఒకట్రెండు సర్వేలు మాత్రమే బీజేపీకి అనుకూల ఫలితాలు ఇచ్చాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎంతవరకు నిజమవుతాయనేది ఈ నెల 13న తేలిపోతుంది.

ఎగ్జిట్ పోల్ ఫలితాలు తారుమారవుతాయని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి (Jithender Reddy) పేర్కొన్నారు. కర్ణాటక ప్రజలు తమ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. “నేను గొప్ప జ్యోతిష్యుడిని. నేను బళ్లారి నగరంలో 25 రోజులు ఉండి కర్ణాటక ప్రజల పల్స్ చూశాను. మోదీజీ, అమిత్‌షాజీ, నడ్డాజీ ఎంతో కష్టపడ్డారు. ప్రజలు మాకు పూర్తి మెజారిటీ ఇస్తారు. చెత్త సర్వేలు” అంటూ జితేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. విజిల్ వేస్తున్న ఫొటోను ఆయన షేర్ చేశారు. బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందన్న విశ్వాసం జితేందర్ రెడ్డిలో కనబడుతోంది.

72.67 శాతం పోలింగ్ నమోదు
బుధవారం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో 72.67 శాతం పోలింగ్ నమోదయింది. 2018 ఎన్నికలతో పోల్చుకుంటే ఇది కొంచెం ఎక్కువ. గత అసెంబ్లీ ఎన్నికల్లో 72.10 శాతం పోలింగ్ నమోదయింది. చిక్కబళ్లాపూర్ జిల్లాలో అత్యధికంగా 85.83 శాతం, రామనగరంలో 84.98 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 13న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Also Read: 2018లో కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ ఎలా వచ్చాయి? చివరకు ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరగనుంది?

కాంగ్రెస్ పార్టీకే ఎగ్జిట్ పోల్స్ పట్టం
పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) ఫలితాలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయి. హస్తం పార్టీకే ఎడ్జ్ ఉండే అవకాశముందని అంచనా వేశాయి. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 140 సీట్లు గెలిచే అవకాశముందని ఇండియాటుడే యాక్సిస్ మై ఇండియా సర్వే వెల్లడించింది. బీజేపీ గరిష్టంగా 80 స్థానాల్లో విజయం సాధించవచ్చని తెలిపింది. జేడీ(ఎస్)కు 25 వరకు సీట్లు వచ్చే చాన్స్ ఉందని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి 43, బీజేపీకి 35, జేడీ(ఎస్)కు 16 శాతం ఓట్ షేర్ రావొచ్చని అంచనా కట్టింది.

Also Read: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు నిజమవుతాయా? గతంలో అనేక సార్లు ఘోరంగా విఫలం.. ఎప్పుడెప్పుడంటే?