అయోధ్య రామాలయంకు ముహుర్తం పెట్టిన పూజారికి బెదిరింపులు

  • Publish Date - August 4, 2020 / 08:07 AM IST

ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామాలయానికి పునాది వేయనున్నారు. 40 కిలోల వెండి ఇటుకతో రామ్ మందిరానికి ప్రధాని మోడీ పునాది రాయి వేయనున్నారు. అయోధ్య‌లో రామ మందిర నిర్మాణ భూమి పూజ జ‌ర‌గ‌నున్న విష‌యం విదిత‌మే.



అయితే స‌ద‌రు పూజ కార్య‌క్ర‌మానికి క‌ర్ణాట‌క‌కు చెందిన 75 ఏళ్ల పండిట్ ఎన్ఆర్ విజ‌యేంద్ర శ‌ర్మ ముహూర్తం పెట్టారు. ఈయ‌న బెల్గావిలో ఉంటారు. రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టుకు చెందిన స‌భ్యుల్లో ఒక‌రైన స్వామి గోవింద్ దేవ్ గిరిజికి శ‌ర్మ అత్యంత స‌న్నిహ‌తులు. అందువ‌ల్లే శ‌ర్మ ఆ భూమి పూజ‌కు ముహూర్తం పెట్టారు.

ఫిబ్ర‌వ‌రిలోనే శ‌ర్మ‌ను నిర్వాహ‌కులు భూమి పూజ కార్య‌క్ర‌మానికి ముహూర్తం పెట్ట‌మ‌ని కోరగా.. శ‌ర్మ అప్ప‌ట్లో ఏప్రిల్‌లో అక్ష‌య తృతీయ నాడు శంకుస్థాప‌న‌కు ముహూర్తం పెట్టారు. కానీ క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల కార్య‌క్ర‌మం వాయిదా ప‌డింది. దీంతో ఆగస్ట్ 5వ తేదీని ముహూర్తంగా ఫిక్స్ చేశారు. ఆ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌లోపు పూజ చేయాల్సి ఉంటుంది. త‌రువాత రాహు కాలం వ‌స్తుంద‌ని శ‌ర్మ తెలిపారు.



ఇదిలా ఉంటే భూమి పూజకు ముహుర్తం పెట్టిన 75 ఏళ్ల పూజారి విజయేంద్రకు ఫోన్‌లో బెదిరింపు వచ్చాయట. ఈ మేరకు బేలగావిలోని తిలక్వాడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బెదిరింపుకు సంబంధించి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దీనిపై పూజారి విజయేంద్ర శ‌ర్మ మాట్లాడుతూ, ‘ముహూర్తం తేదీని ఎందుకు చెప్పావని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌లో బెదరించారని, భూమి పూజన్ తేదీని ఇవ్వమని నిర్వాహకులు నన్ను అభ్యర్థించారని, నేను దానిని అనుసరించానని అతనికి వెల్లడించినట్లు’ చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తి తన పేరును వెల్లడించలేదని ఆయన అన్నారు. దీంతో బెలగావిలోని శాస్త్రి నగర్‌లో పూజారి నివాసంలో పోలీసులను మోహరించారు.



విజయేంద్ర శ‌ర్మ గ‌తంలో ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుల‌కు జ్యోతిష్యం చెప్పారు. మొరార్జీ దేశాయ్‌, అట‌ల్ బిహారీ వాజ్‌పేయిలు శ‌ర్మ స‌ల‌హాలు తీసుకునేవారు. వాజ్‌పేయి ప్ర‌ధానిగా ప్ర‌మాణం చేసిన‌ప్పుడు శ‌ర్మే స్వ‌యంగా అందుకు ముహూర్తం పెట్టారు. విజ‌యేంద్ర శ‌ర్మ‌కు మొత్తం 8 భాష‌లు తెలుసు. ఈయ‌న బ‌నార‌స్ హిందూ యూనివ‌ర్సిటీ నుంచి స్కాల‌ర్‌గా గోల్డ్ మెడ‌ల్ అందుకున్నారు.