Karur Stampede: తమిళనాడు రాష్ట్రం కరూర్ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకర ఘటన అని చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధాని మోదీ. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.
“తమిళనాడులోని కరూర్‌లో జరిగిన రాజకీయ ర్యాలీలో చోటు చేసుకున్న దురదృష్టకర సంఘటన చాలా బాధాకరం. ఆప్తులను కోల్పోయిన వారికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా” అని మోదీ ఆకాంక్షించారు.
కరూర్ తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం అని వాపోయారు. ఇది దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.
కరూర్ లో టీవీకే అధ్యక్షుడు విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. 30 మందికిపైగా చనిపోయారు. 50మందికి పైగా గాయపడ్డారు. బాధితులను వేర్వేరు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయ్ ర్యాలీకి 10వేల మది వస్తారని టీవీకే నేతలు అంచనా వేశారు. అయితే, ఊహించని విధంగా ర్యాలీకి 50వేల మందికిపైగా జనం వచ్చినట్లు సమాచారం. పరిమితికి మించి జనం రావడంతో తొక్కిసలాట ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
కరూర్ లో పెను విషాదం చోటు చేసుకుంది. సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది చనిపోయారు. 50 మందికిపైగా గాయపడ్డారు. తొక్కిసలాటలో మహిళలు ఎక్కువగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను కరూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంచనాలకు మించి అభిమానులు, జనం వేల సంఖ్యలో ర్యాలీకి తరలివచ్చారు. దాంతో తొక్కిసలాట జరిగింది.
శనివారం మధ్యాహ్నమే విజయ్ మీటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల విజయ్ లేటుగా వచ్చారు. జనాలు మరింతగా పోగయ్యే వరకు విజయ్ రాలేదు. కరూర్ లో చాలా ఇరుకైన ప్రాంతంలో ఈ సభను ఏర్పాటు చేశారు. ఇలా అనేక కారణాలతో ఈ దుర్ఘటన జరిగింది. విజయ్ సభా వేదిక పై నిల్చుని ప్రసంగిస్తూ ఉండగానే.. క్రమంగా తొక్కిసలాట మొదలైంది. ఈ దుర్ఘటనతో విజయ్ సైతం షాక్ కి గురయ్యారు. బాధితులను కాపాడాలని పోలీసులను, డాక్టర్లను ప్రాధేయపడ్డారు. కొంతమందికి ఆయనే నీళ్లు అందించే ప్రయత్నం కూడా చేశారు.
పార్టీ ప్రకటించిన తర్వాత విజయ్ తమిళనాడు రాష్ట్రం మొత్తం మీటింగ్ లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇటీవలే మూడు నాలుగు చోట్ల మీటింగ్స్ పెట్టారు. ఇవాళ కరూర్ లో మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ కు అనుమతులు కూడా తీసుకున్నారు. అయితే చాలా ఇరుకైన ప్రాంతంలో భారీ బహిరంగ సభకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. సుమారు 50వేల మంది మీటింగ్ కు హాజరయ్యారని భావిస్తున్నారు.