×
Ad

PM Modi: బిహార్‌లో జంగిల్ రాజ్ ఎప్పటికీ తిరిగి రాదు.. ఇక దేశవ్యాప్తంగా S.I.R.. కాంగ్రెస్ ముక్కలవడం ఖాయం- ప్రధాని మోదీ

వికసిత్ బిహార్ కోసం బిహార్ ప్రజలు ఓటేశారు. మేము ప్రజలకు సేవకులం, వారి మనసులు గెలుచుకున్నాం.

PM Modi: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. బీహార్ లో సుపరిపాలన, అభివృద్ధి విజయం సాధించాయని ఆయన అన్నారు. ప్రజల మనసు గెలుచుకుని అధికారంలోకి వచ్చామన్నారు. బీహార్ ప్రజలు ప్రచండ విజయాన్ని అందించారని వ్యాఖ్యానించారు. బిహార్ లో జంగిల్ రాజ్ ఇక ఎప్పటికీ రాదని ప్రధాని మోదీ చెప్పారు. కొందరు MY ఫార్ములాతో విజయం సాధించాలని అనుకున్నారు.. కానీ, మా MY ఫార్ములా మహిళలు, యూత్ అని వెల్లడించారు.

”వికసిత్ బిహార్ కోసం బిహార్ ప్రజలు ఓటేశారు. మేము ప్రజలకు సేవకులం, వారి మనసులు గెలుచుకున్నాం. బిహార్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. నితీష్ కుమార్ రాష్ట్రానికి మంచి నాయకత్వం అందించారు. ఈ విజయంతో ఎన్నికల సంఘంపై ప్రజలకు నమ్మకం పెరిగింది. ఈసీకి, ఓటర్లకు ధన్యవాదాలు. ఇక దేశవ్యాప్తంగా SIR ఉంటుంది. బిహార్ లో నితీశ్ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అతి గొప్ప విజయం సాధించింది” అని ప్రధాని మోదీ అన్నారు.

‘ఆర్జేడీ, కాంగ్రెస్ అబద్ధాలను ప్రజలు తిప్పికొట్టారు. దేశాన్ని, బిహార్ ని వికసిత్ చేస్తాం. బిహార్ ఎన్నికలను చాలా ప్రశాంతంగా నిర్వహించాం. మరో 25ఏళ్లు బిహార్ లో ఎన్డీయే పాలన సాగుతుంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు బిహార్ యువతకు ఉపాధి కల్పించలేదు.’ అని ప్రధాని మోదీ అన్నారు.

”బిహార్ యువ ఓటర్లు S.I.R ను చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఓటర్లు ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థించారు. ఒకప్పుడు బిహార్ లో అరాచక శక్తులు, నక్సలైట్ల ప్రభావం ఉండేది. మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగిసేది. కానీ, ప్రజలంతా ఇప్పుడు స్వేచ్చగా రికార్డ్ స్థాయిలో ఓటు వేశారు. ఒకప్పుడు ఎన్నికల హింస వల్ల చాలా చోట్ల రీ పోలింగ్ జరిగేది. ఈసారి ఎక్కడా అలాంటి పరిస్థితి లేకుండా పోలింగ్ సజావుగా సాగింది. జంగిల్ రాజ్ పోవడంతోనే ఇవన్నీ సాధ్యమయ్యాయి. బీహార్ లో మా ఈ గెలుపు బెంగాల్ వరకు వెళ్తుంది. బెంగాల్ నుంచి కూడా జంగిల్ రాజ్ ను పీకి పారేయాలి” అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ.

ఎన్డీయే విజయోత్సవంలో కాంగ్రెస్ కు కొత్త పేరు పెట్టారు ప్రధాని మోదీ. అది కాంగ్రెస్ కాదు.. MMC.. అంటే.. ముస్లిం లీగ్ మావో కాంగ్రెస్.. అని చెప్పారు. బీహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య గొడవలు బయటపడతాయన్నారు. కాంగ్రెస్ లో చిచ్చు రావడం ఖాయం అని, కాంగ్రెస్ ముక్కలు కావడం ఖాయం అని చెప్పారు. కాంగ్రెస్ పరాన్న జీవి, పక్కన వాళ్ల మీద పడి బతుకుతుంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు మోదీ. రాహుల్ చెరువులో దూకి.. ఆయన మునిగాడు.. పక్కనోళ్లను ముంచే ప్రాక్టీస్ చేశాడు అని ఎద్దేవా చేశారు.