హై అలర్ట్: కేరళలో మరో వైరస్.. కోళ్లను చంపేయాలని ఆర్డర్

  • Publish Date - March 14, 2020 / 10:12 AM IST

ప్రపంచదేశాలు కరోనా భయంతో వణికిపోతుంటే.. ఇప్పుడు మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. అదే, బర్డ్ ఫ్లూ. ఈ వైరస్ కారణంగా వేల కోళ్లను చంపేయాలని కేరళా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ వ్యాధి వల్ల మనిషి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 
 
కేరళలోని కొజికోడ్‌లో రెండు కోళ్ల ఫారాల్లో ప్రతిరోజూ సుమారు 200కి పైగా కోళ్లు చనిపోయాయి. కోళ్లు ఎందుకు చనిపోతున్నాయని కోళ్ల ఫాం యజమానులు, నిర్వహకులు సరిగ్గా గమనించగా.. వాటిలో బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఈ విషయం తెలుసుకున్న కేరళ ప్రభుత్వానికి చెందిన సంబంధిత అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించి బర్డ్ ఫ్లూ వ్యాధి నివారించడానికి తీసకోవాలసిన జాగ్రత్తలపై చర్చించారు.

ఈ వ్యాధి కారణంగా వేలాది కోళ్లు బలి కానున్నాయి. కోళ్ల‌ను చంపేందుకు ప్ర‌భుత్వ అధికారులు ఇప్పటికే ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. ప‌ర‌ప్ప‌న‌గ‌డిలో ప్రాంతంలో ఉన్న అన్ని పౌల్ట్రీలలోని కోళ్లను వైద్య సిబ్బంది పరీక్షిస్తున్నారు.  కోజికోడ్‌ ప్రాంతంలో మొత్తం 4,000 పౌల్ట్రీల్లోని కోళ్లను చంపేశారు. బర్డ్ ఫ్లూ ఉన్నట్టు అనుమానం వస్తే కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసిన సమాచారం అందజేయాలని కోరారు.

కేరళ అటవీ, జంతు సంరక్షణ శాఖ మంత్రి కే రాజు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.  బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన ప్రాంతాల్లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించామని తెలిపారు. ఆ వ్యాధిని అరికట్టడానికి ఆరోగ్య శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని, ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని కేరళ మంత్రి కే. రాజు తిరువనంతపురంలో మీడియాకు చెప్పారు.