Sabarimala Temple: దర్శనానికి 9 ఏళ్ల బాలిక.. అనుమతిచ్చిన కేరళ హైకోర్ట్

ఓ తొమ్మిదేళ్ల బాలికకు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లేందుకు కేరళ హైకోర్టు అనుమతిచ్చింది. తన తండ్రితో కలిసి ఆగస్టు 23న శబరిమలకు

Sabarimala Temple: ఓ తొమ్మిదేళ్ల బాలికకు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లేందుకు కేరళ హైకోర్టు అనుమతిచ్చింది. తన తండ్రితో కలిసి ఆగస్టు 23న శబరిమలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ బాలిక దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. బాలిక విజ్ఞ‌ప్తిపై సానుకూలంగా స్పందించి అనుమతిచ్చింది. బాలిక పదేళ్లు రాకముందే శబరిమల వెళ్లాలనుకుంటుందని బాలిక తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.

ఒకవేళ ఇప్పుడు వెళ్లలేకపోతే అయ్యప్ప దర్శనానికి మరో 40 ఏళ్లు ఆగాల్సి ఉంటుందని ఆమె తరపు న్యాయవాది వివరణకు కోర్టు అనుకూలంగా స్పందించి అనుమతిచ్చింది. శబరిమలలో 10 నుండి 50 ఏళ్ల మధ్య వయసు మహిళ ప్రవేశంపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు దీనిపై తీర్పులు ఇచ్చినా.. తప్పక పాటించాల్సిన ఆచారమా కాదా అన్నది తేల్చాలని కమిటీలను నియమించినా ఈ సమస్యకు ఇంకా పరిష్కారం లభించనేలేదు.

మరోవైపు శబరిమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా 72 గంటల ముందు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలనే నిబంధన ఉంది. రెండు డోస్‌ల టీకా తీసుకున్నవారు, పరీక్షల్లో నెగెటివ్ వచ్చినవారికి మాత్రమే దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న పెద్దలు పాల్గొనే అన్ని కార్యక్రమాల్లోనూ పిల్లలను అనుమతించాలని ఏప్రిల్ నెలలో కోర్టు తీర్పు ఇచ్చింది. వీటి ఆధారంగానే హైకోర్టు ఇప్పుడు తొమ్మిదేళ్ల బాలిక దర్శనానికి అనుమతిచ్చింది.

కాగా, ఏటా నిర్వహించే నిరపుతారి వేడుక కోసం అయ్యప్ప ఆలయ ద్వారాలు ఆగస్టు 15న తెరుచుకుకోగా.. కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకొని రోజుకు 15 వేల మంది భక్తులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఆ సంఖ్య పూర్తయిన వెంటనే ఆలయాన్ని మూసివేస్తున్నారు. ఆగస్టు 23 సాయంత్రం ఈ పూజలు పూర్తి కానుండగా ఆ రోజే తొమ్మిదేళ్ల బాలిక కూడా అయ్యప్పను దర్శించుకోనుంది.

ట్రెండింగ్ వార్తలు