సినీ, రాజకీయ, క్రీడ..వివిధ రంగాలకు చెందిన వారికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. వారి కోసం అభిమానులు వినూత్నంగా ప్రవర్తిస్తుంటారు. వారి అభిమానులు చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను ఆరాధించే వారు ఎంతో మంది ఉంటారు. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం ఇతనికి ఎంతో మంది ఫావర్స్ ఉన్నారు.
ఇలాంటి కోట్లాది మందిలో కేరళలోని కాలికట్‌లో ఉన్న మలబార్ క్రిస్టియన్ కళాశాల చరిత్ర విభాగం అధిపతి ప్రొఫెసర్ ఎంసీ వశిష్ట్ కూడా సచిన్ ఫ్యాన్. మాస్టర్ బ్లాస్టర్ బ్యాట్స్ మెన్‌పై తన అభిమానాన్ని అందరికంటే భిన్నంగా చాటుకున్నాడు. సచిన్ రిటైర్ అయిన 2013లోనే తమ కళాశాలలో ‘సచిన్స్ గ్యాలరీ’ పేరిట అతడి ఘనతలు, విశేషాల వివరాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. సచిన్‌పై 11 (తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, ఒడియా, బెంగాలీ, అస్సామీ, మరాఠీ, గుజరాతి, హిందీ, ఇంగ్లీష్) భాషల్లో రూపొందించిన 60 పుస్తకాలున్నాయి. ఇన్ని భాషల్లో సచిన్ లైబ్రరీ ఏర్పాటు వెనుక దేశ సమైక్యతకు క్రికెట్ ఏ విధంగా తోడ్పడుతుందో చాటే ఉద్దేశ్యం ఉంది.