Mumbai Mayor : కుంభమేళా భక్తులు కరోనాని ప్రసాదంలా పంచుతారు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి భారీగా నమోదవుతున్న సమయంలో ఉత్త‌రాఖండ్‌లోని హ‌రిద్వార్‌లో నిర్వహిస్తున్న కుంభ‌మేళా తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.

Kumbh Mela ‌దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి భారీగా నమోదవుతున్న సమయంలో ఉత్త‌రాఖండ్‌లోని హ‌రిద్వార్‌లో నిర్వహిస్తున్న కుంభ‌మేళా తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. కుంభమేళాలో కరోనా ప్రబలడంతో అక్కడి నుంచి వచ్చే భక్తులతో కోవిడ్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ముంబై వాసులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేళాను ఉద్దేశించి శనివారం ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కుంభ‌మేళా నిర్వ‌హించ‌డంవ‌ల్లే ఇప్పుడు అక్క‌డ క‌రోనా మ‌హ‌మ్మారి వేగంగా ప్ర‌బ‌లుతున్న‌ద‌ని ముంబై మేయర్ ఆరోపించారు. కుంభ‌మేళాకు వివిధ రాష్ట్రాల నుంచి భ‌క్తులు వెళ్లార‌ని, ఇప్పుడు వారంతా త‌మ‌త‌మ రాష్ట్రాల‌కు తిరిగి వెళ్లి క‌రోనా వైర‌స్‌ను ప్ర‌సాదంలా పంచిపెడుతారని అన్నారు. కుంభమేళా నుంచి వచ్చిన భక్తులు తప్పనిసరిగా హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఆమె సూచించారు. కుంభమేళా నుంచి ముంబైకి తిరిగొచ్చిన భక్తులను గుర్తించి క్వారంటైన్‌కి తరలిస్తున్నట్లు మేయర్ కిశోరి తెలిపారు. నగరంలో 95 శాతం మంది కోవిడ్ నిబంధనలను సక్రమంగా పాటిస్తున్నారని.. మిగిలిన 5 శాతం మందితోనే సమస్యలు వస్తున్నాయని ఆమె అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్ విధించడమే మేలని ఆమె అభిప్రాయపడ్డారు.

మరోవైపు,కరోనా హాట్‌స్పాట్‌గా కుంభమేళా మారుతోందంటూ పలువురు ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో ముంబై మేయర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీస్తున్నాయి.కాగా, ఇప్పటికే కుంభమేళాలో పాల్గొన్న సాధువుల్లో చాలామందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఈ క్రమంలో కుంభమేళాను ప్రతీకాత్మకంగా అంటే జనం లేకుండా జరపాలని ప్రధాని మోడీ సాధువుల్ని కోరారు. ఇదే విషయాన్ని శనివారం మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఏప్రిల్‌ 1న మొదలైన కుంభమేళా ఈనెల 30వరకూ జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు