Lakhimpur Kheri Violence : అమిత్ షాతో మిశ్రా భేటీ..మంత్రి పదవి సేఫ్!

కేంద్ర సహాయ మంత్రి అజయ్​ మిశ్రా బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.

Lakhimpur Kheri Violence కేంద్ర సహాయ మంత్రి అజయ్​ మిశ్రా బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్‌ ఘటన గురించి అమిత్ షాతో మిశ్రా సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. లఖింపూర్‌ ఖేరీలో రైతుల మరణాలకు మిశ్రా కుమారుడే కారణమైనట్లు ఆరోపణలు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.

అయితే మిశ్రా తన పదవికి రాజీనామా చేయబోతున్నారంటూ అంతకుముందు వార్తలు రాగా..అమిత్ షాతో భేటీ సమయంలో రాజీనామా గురించి ప్రస్తావనే రాలేదని సమాచారం. మిశ్రా మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశమే లేదని సృష్టమవుతోంది.

ఇక,లఖింపూర్‌ లో ఆదివారం హింస జరుగుతున్న సమయంలో తాను కానీ.. తన కుమారుడు కానీ ఆ ప్రాంతంలో లేమని మిశ్రా చెప్పారు. తమ కారు వేరే మార్గంలో వెళ్లిందని చెప్పారు. దీనిపై ఏ విచారణ ప్యానెల్ ముందు హాజరుకావడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో దాగి ఉన్న కుట్రను బయట పెట్టేందుకు దర్యాప్తు సంస్థలు తన పని ప్రారంభించాయన్నారు. ఈ కేసు విచారణలో ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేదన్నారు. నిందితులు ఎవరైతే వారి మీద కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

కాగా, ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరీలో ఆదివారం యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్‌ ఖేరీ జిల్లా టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో మంత్రుల కాన్వాయ్‌ లోని రెండు కార్లు రైతులపై దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా..ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు. అయితే రైతులపైకి దూసుకెళ్లిన ఓ కారులో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నట్లు రైతులు ఆరోపిస్తుండగా..అసలు ఆ సమయంలో తాను అక్కడ లేనని ఆశిష్ మిశ్రా చెబుతున్నారు.

ALSO READ  తాను అక్కడ లేనన్న కేంద్రమంత్రి కుమారుడు..నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న మంత్రి

ట్రెండింగ్ వార్తలు