ఓ ఎక్స్ పరిమెంట్ గా రెండేళ్లు అగ్రి చట్టాలు అమలుచేయనివ్వండి…రాజ్ నాథ్

Let farm laws be implemented for two years నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతులు..చర్చలకు ముందుకురావాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విజ్ణప్తి చేశారు. నూతన చట్టాలకు లాభదాయకంగా లేవు అని రైతులు అనుకుంటే..ఆ చట్టాలకు ప్రభుత్వం సవరణలు చేస్తుందని రాజ్ నాథ్ అన్నారు. ధర్నాలో పాల్గొంటున్నవారంతా రైతులేనని.. వారంతా రైతుల కుటంబాల్లో జన్మించినవారని పేర్కొన్నారు. వారి పట్ల తమకు చాలా గౌరవం ఉందని రాజ్ నాథ్ అన్నారు.

ఢిల్లీలోని ద్వారకాలో శుక్రవారం(డిసెంబర్-25,2020)ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ నాథ్..తాను కూడా రైతు కొడుకునని తెలిపారు. రైతులకు ఇబ్బంది కలిగించే పనులను మోడీ ప్రభుత్వం ఎన్నటికీ చేయదని హామీ ఇచ్చా రు. ఓ ఎక్సపరిమెంట్(ప్రయోగం)గా నూతన వ్య‌వ‌సాయ చ‌ట్టాలను క‌నీసం ఒక ఏడాది లేదా రెండేళ్ల పాటు అమ‌లు చేయ‌నివ్వాలని రైతులను కోరారు.

ఒక‌వేళ ఆ చ‌ట్టాలు రైతుల‌కు మేలు చేయ‌కుంటే, అప్పుడు అవ‌స‌ర‌మైన స‌వ‌ర‌ణ‌లు చేస్తామ‌ని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. చ‌ర్చ‌ల‌తో అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌వ‌చ్చు అని, రైతుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌గాల‌ని ప్ర‌ధాని మోడీ ఆకాంక్షిస్తున్న‌ట్లు రాజ్‌నాథ్ తెలిపారు. ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్న రైతులంతా వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై జ‌రిగే చ‌ర్చ‌ల‌కు రావాల‌ని ఆయ‌న కోరారు.

మరోవైపు, నూతన వ్యవసాయ చట్టాలపై రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. కనీస మద్దతు ధర (ఎంఎస్​పీ) విపక్షాలు రైతులను తప్పుదోవపట్టిస్తున్నాయి. ఎంఎస్​పీ కొనసాగుతుందని స్పష్టం చేయాలనుకుంటున్నాని ఇవాళ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా వ్యాఖ్యానించారు. మోడీ నిజమైన రైతు పక్షపాతి అని అమిత్ షా అన్నారు.

కాగా, కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న ఆందోళనలు 30వ రోజుకి చేరుకున్నాయి. అయితే వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నేతలు చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ గురువారం లేఖ రాసిన విషయం తెలిసిందే. రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపేందుకు సిద్ధమని ఆ లేఖలో వివరించారు. తేదీని ఖరారు చేసుకుని రావాలని కేంద్రం సూచించింది.