BJP Vs TMC: పశ్చిమ బెంగాల్‌లో ప్రతిదీ రాజకీయ వివాదంగా మారుతోంది. పార్టీలు అలా మార్చేస్తున్నాయ్. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని దగ్గర నుంచి చూద్దామని వేల రూపాయలు ఖర్చు చేసి వచ్చిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. కోల్‌కతాలోని వివేకానంద యువ భారతి సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఈవెంట్ తీవ్ర గందరగోళానికి, ఉద్రిక్తతకు దారితీసింది. తమ అభిమాన ఆటగాడు మైదానంలో కేవలం 10 నిమిషాలలోపే కనిపించి వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు.
టికెట్ల కోసం 5వేల రూపాయల నుంచి 12వేల రూపాయల వరకు చెల్లించి, గంటల తరబడి ఎదురుచూసిన అభిమానులు.. మెస్సీ కాసేపటికే మైదానం వీడటంతో సహనం కోల్పోయారు. నిరసనగా స్టేడియంలోని స్టాండ్స్‌లో ఆందోళనకు దిగారు. కొందరు బాటిళ్లు విసరగా, మరికొందరు హోర్డింగులను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి అభిమానులను చెదరగొట్టాల్సి వచ్చింది.
దర్యాఫ్తునకు గవర్నర్ కార్యాలయం ఆదేశాలు..
మరోవైపు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిందిగా గవర్నర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఈ కార్యక్రమాన్నిసరిగా నిర్వహించలేదంటూ బీజేపీ ఆరోపణలకు దిగింది. ఓ పెద్ద సెలబ్రెటీ వస్తే ఇదేనా ప్లానింగ్ చేసే పద్దతంటూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి మండిపడ్డారు.
దీంతో ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజిన్ (SIR) పేరుతో ఓటర్ల జాబితా సవరణపై జరుగుతున్న రాజకీయ రగడ ఈ ఎపిసోడ్‌కి కూడా అంటుకుంది. ఇక మెస్సీని చూసేందుకు వచ్చి నిరాశకి గురైన ఫ్యాన్స్ అందరికీ వారి టిక్కెట్ల డబ్బు రీఫండ్ చేస్తామని ప్రకటించారు.
అంతకుముందు, మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా కోల్‌కతాకు చేరుకున్న మెస్సీకి ఘన స్వాగతం లభించింది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, పశ్చిమ బెంగాల్ మంత్రి సుజిత్ బోస్‌తో కలిసి ఆయన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించారు. అయితే, స్టేడియంలో జరిగిన గందరగోళం కారణంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీతో జరగాల్సిన సమావేశాలను మెస్సీ రద్దు చేసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ముందుగానే కోల్‌కతా నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
Also Read: బీ కేర్ ఫుల్..! వెయిట్ లాస్ డ్రగ్ ఒజెంపిక్ వాడకంపై డాక్టర్ల వార్నింగ్.. ఇది అందరి కోసం కాదు..!