Lohagad Fort : కేతన్ అగర్వాల్ హత్య కేసు ఎఫెక్ట్.. లోహగడ్ కోటకు 25శాతం పెరిగిన పర్యాటకులు.. సియా పాయింట్‌ను చూసేందుకు ఆసక్తి
Lohagad Fort : కేతన్ అగర్వాల్ హత్య తరువాత.. ఘటన జరిగిన ప్రదేశమైన చారిత్రక లోహగడ్ కోటను సందర్శించే వారి సంఖ్య దాదాపు 25శాతం పెరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
Lohagad Fort
- కేతన్ అగర్వాల్ హత్య కేసు ఎఫెక్ట్..
- లోహగడ్ కోటకు 25శాతం పెరిగిన పర్యాటకులు
- సియా పాయింట్‌ను చూసేందుకు ఆసక్తి
Lohagad Fort : పుణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 26ఏళ్ల కేతన్ అగర్వాల్ జూన్ 18న మహారాష్ట్రలోని చారిత్రక లోహగఢ్ కోట వద్ద 400 అడుగుల లోతు లోయలో పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేయగా.. అతడికి కాబోయే భార్య సియా గోయల్ ఆమె ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి హత్య చేసినట్లు తేలింది. పోలీసులు ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు దర్యాప్తును ముమ్మరం చేయగా.. మరోవైపు.. కేతన్ మృతి చెందిన లోహగడ్ కోటకు పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది.
కేతన్ అగర్వాల్ హత్య తరువాత.. ఘటన జరిగిన ప్రదేశమైన చారిత్రక లోహగడ్ కోటను సందర్శించే వారి సంఖ్య దాదాపు 25శాతం పెరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ కేసులో కేతన్ అగర్వాల్‌ను అతని స్నేహితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి కోటపై నుంచి తోసివేసి హత్య చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటన జరిగినట్లు చెబుతున్న ప్రాంతాన్ని ప్రస్తుతం అనధికారికంగా “సియా పాయింట్” గా పిలుస్తున్నారు. దీంతో కోటకు వచ్చే పర్యాటకులు ఆ ప్రాంతాన్ని చూపించాలని భద్రతా సిబ్బంది, స్థానిక గైడ్లు, ఇతర సందర్శకులను అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ట్రెక్కింగ్‌కు ప్రసిద్ధి చెందిన లోహగడ్ కోట ఇప్పుడు కేతన్ హత్య కేసుతో మరింత చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్రంలోని మావల్ ప్రాంతంలో ఉన్న ఈ కోట లోనావాలా నుంచి సుమారు 11 కిలోమీటర్లు, పుణె నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లోహగడ్ కోట మహారాష్ట్రలో్ అత్యంత ప్రసిద్ధ ట్రెక్కింగ్ కేంద్రాల్లో ఒకటి. లోహగడ్ అంటే ఇనుప కోట అని అర్ధం. ఈ కోటకు దాదాపు 2వేల ఏళ్ల చర్రిత ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. దీని నిర్మాణం శాతవాహనుల కాలంలో ప్రారంభమైనట్లుగా పేర్కొంటారు.
ఈ కోటను సందర్శించేందుకు నిత్యం సందర్శకులు వస్తుంటారు. అయితే, సాధారణంగా వారాంతాలు, ప్రభుత్వ సెలవుల రోజుల్లో లోహగడ్ కోటకు రోజుకు 4వేల నుంచి 5వేల మంది సందర్శకులు వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. కేతన్ అగర్వాల్ హత్య ఘటన తరువాత సాధారణ రోజుల్లోనూ సందర్శకులు భారీగా వస్తున్నారని, గతంకంటే సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగిందని, ముఖ్యంగా చాలా మంది సందర్శకులు సియా పాయింట్ ను చూడాలనే ఉద్దేశంతో వస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
