కాంగ్రెస్ కీలక భేటీ.. లోక్‌స‌భ‌ ఎన్నికల అభ్యర్థుల మూడో జాబితాపై కసరత్తు

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 82 పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది.

Congress CWC Meeting

Congress CWC Meeting  : లోక్‌స‌భ‌ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక, మ్యానిఫెస్టో, తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్ల్యుసి), కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, సిడబ్ల్యూసీ సభ్యులు పాల్గోనున్నారు. రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటారు. సీడబ్ల్యూసీ సమావేశంలో సార్వత్రిక ఎన్నికల మ్యానిఫెస్టో, ఎన్నికల వ్యూహాలు, ప్రచారాలపై నేతలు చర్చించనున్నారు. అనంతరం, కాంగ్రెస్ ముసాయిదా మేనిఫెస్టోకి సిడబ్ల్యూసీ ఆమోదం తెలపనుంది. మోదీ గ్యారెంటీలకు ధీటుగా ఐదు న్యాయ గ్యారెంటీలు కాంగ్రెస్ తేనుంది. భాగిదారీ న్యాయం, కిసాన్ న్యాయం, నారీ న్యాయం, శ్రామిక్ న్యాయం, యువ న్యాయం అనే ఐదు అంశాలపై 25 హామీలను కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు ఇవ్వనుంది.

Also Read : త‌మిళిసై ఎక్కడి నుంచి బరిలోకి దిగ‌నున్నారు? తెలంగాణకు కొత్త గ‌వ‌ర్నర్ ఎవ‌రు?

సిడబ్ల్యూసీ సమావేశం ముగిశాక సాయంత్రం 4గంటలకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో లోక్ సభ ఎన్నికలకు మూడో అభ్యర్థుల జాబితాపై చర్చిస్తారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 82 పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. తొలి విడతలో 39 మంది, రెండో విడతలో 43 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ముందుగా ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో అభ్యర్థులను సీఈసీ ఖరారు చేయనుంది.

Also Read : CM Revanth Reddy : సోనియాగాంధీతో సీఎం రేవంత్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

మరోవైపు తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 13 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను సీఈసీ ఖరారు చేయనుంది. మొదటి లిస్ట్ లో మహబూబ్ నగర్, మహబూబాబాద్, జహీరాబాద్, నల్గొండ స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్, పెద్దపల్లి, భువనగిరి, చేవెళ్ల, నాగర్ కర్నూల్, మల్కాజిగిరి, మెదక్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సీఈసీ సమావేశంలో తెలంగాణలోని 13నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపైనా చర్చ జరగనుంది. సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలు, సర్వేలు, ఇటీవల పార్టీలో చేరిన నేతల ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక ఉంటుందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.

 

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు