త‌మిళిసై ఎక్కడి నుంచి బరిలోకి దిగ‌నున్నారు? తెలంగాణకు కొత్త గ‌వ‌ర్నర్ ఎవ‌రు?

త‌మిళిసై ఎక్కడి నుంచి బరిలోకి దిగ‌నున్నారు? తెలంగాణకు కొత్త గ‌వ‌ర్నర్ ఎవ‌రు?

Soundararajan Sensational Decision

Tamilisai Soundararajan : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గ‌వ‌ర్నర్ పదవీకి రాజీనామా చేశారు. ఈ నాలుగున్నర ఏళ్లలో తమిళిసై ఎన్నో సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు. గత ప్రభుత్వంలో ప్రగతిభవన్‌ వర్సెస్ రాజ్‌భవన్‌ అన్నంత రేంజ్‌లో వివాదాలు సాగాయి. అప్పటి సీఎం కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అనేలా పరోక్ష రాజ‌కీయాన్ని సాగించారు. ఇప్పుడు లోక్‌స‌భ బ‌రిలో దిగేందుకు తమిళిసై రాజీనామా చేయ‌డం హాట్‌టాపిక్‌గా మారింది. ఇంత‌కీ త‌మిళిసై ఎక్కడి నుండి బ‌రిలో దిగ‌నున్నారు? తెలంగాణకు రాబోయే కొత్త గ‌వ‌ర్నర్ ఎవ‌రు?

కేసీఆర్ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ..
2019 సెప్టెంబ‌ర్ 8న తెలంగాణకు గ‌వ‌ర్నర్‌గా త‌మిళి సై సౌంద‌రరాజ‌న్ వ‌చ్చారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో గ‌వ‌ర్నర్‌గా త‌మిళిసై తెలంగాణ‌పై చెర‌గ‌ని ముద్ర వేశారు. కేసీఆర్ హ‌యాంలో తమిళిసై వ్యవహరించిన తీరు ఓ సంచలనమే అని చెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించటం లేదని బహిరంగంగానే విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాల‌పై.. కొన్ని కీల‌క అంశాల‌పై సైతం ఆమె పేచీ పెట్టారు. కొన్ని సంద‌ర్భాల్లో ప్రభుత్వానికి, గ‌వ‌ర్నర్ కార్యాల‌యానికి మ‌ధ్య ప్రచ్చన్న యుద్ధం న‌డిచింది. కీల‌క‌మైన బిల్లుల‌కు ఆమోద‌ముద్ర వేయ‌కుండా తాత్సర్యం చేయ‌డం.. నెల‌ల త‌ర‌బ‌డి ఆపి తిప్పి పంపడం జ‌రిగాయి. ఈ విష‌యంలో గ‌త ప్రభుత్వం గ‌వ‌ర్నర్ తీరుపై ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వ‌చ్చింది.

వివాదానికి దారితీసిన గవర్నర్ తీరు..
గ‌వ‌ర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామ‌కాల విష‌యంలో సైతం గ‌వ‌ర్నర్ తీరు వివాదాస్పదంగా మారింది. రాజ‌కీయ నేత‌లన్న కార‌ణంగా బీఆర్‌ఎస్ ప్రతిపాదించిన‌ దాసోజు శ్రవ‌ణ్‌, కుర్ర స‌త్యనారాయ‌ణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల‌ను గ‌వ‌ర్నర్ తిరస్కరించారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన కోదండ‌రాం అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో బీఆర్‌ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో గ‌వ‌ర్నర్ నిర్ణయాన్ని రాష్ట్ర హైకోర్టు సైతం త‌ప్పుబట్టింది.

కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం..
ఇక త‌మిళిసై కూడా అవ‌కాశం చిక్కిన ప్రతీసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయ‌త్నం చేశారు. భ‌ద్రాచ‌లం రాముడి గుడికి వెళ్లేందుకు హెలికాప్టర్‌ను ప్రభుత్వం స‌మ‌కూర్చలేద‌ని.. రైల్లో వెళ్లి వచ్చారు. రాజ్‌భ‌వ‌న్‌లో ప్రజాద‌ర్భార్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యల్యపై ఆరా తీశారు. వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు నేరుగా గ్రౌండ్‌లో పర్యటించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కామెంట్స్ చేశారు. పంటికింద రాయిలా మారిన గ‌వ‌ర్నర్ త‌మిళిసై విష‌యంలో గ‌త ప్రభుత్వం కూడా క‌ఠినంగా వ్యవ‌హ‌రించింది. తెలంగాణ బీజేపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌లా వ్యవ‌హ‌రిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత‌లు ఘాటు విమ‌ర్శలు చేశారు.

మ‌రోసారి ప్రత్యక్ష రాజ‌కీయాల్లో అరంగేట్రం..!
త‌మిళ‌నాడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా ఉన్న త‌మిళి సై.. అక్కడి నుండి నేరుగా తెలంగాణ రాజ్‌భ‌వ‌న్‌కు వ‌చ్చారు. ఇప్పుడు మ‌ళ్లీ రాజ్‌భ‌వ‌న్ నుండి మ‌రోసారి ప్రత్యక్ష రాజ‌కీయాల్లో అరంగేట్రం చేయాలని చూస్తున్నారు. అందుకోసమే గ‌వ‌ర్నర్ ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తోంది. త‌మిళిసై రాజీనామాను గ‌వ‌ర్నర్ కార్యాల‌యం కూడా ధృవీక‌రించింది.

తమిళనాడులో బీజేపీ బలోపేతం కావటంలో కీ రోల్..
వృత్తిరీత్యా గైనకాలజిస్ట్ అయిన తమిళిసై బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 1999లో ఆ పార్టీలో చేరారు. తమిళనాడులో బీజేపీ బలోపేతం కావటంలో ఆమె పాత్ర కీలకమైంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా, జాతీయ కార్యదర్శిగా పలు పదవులను నిర్వహించారు. 2006 ఎన్నికల్లో రామనాథపురం నియోజవర్గం నుంచి తొలిసారి ఆమె అసెంబ్లీకి పోటీ చేయగా ఓటమి ఎదురైంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో నార్త్ చెన్నై నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి మరోసారి ఓడిపోయారు. 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వేళచ్చేరి నుంచి పోటీ చేసి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నేతృత్వంలో తూత్తుకుడి నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు.

తెలంగాణ కొత్త గవర్నర్ ఎవరు?
మొత్తం మీద గ‌వ‌ర్నర్ త‌మిళిసై త‌న పొలిటిక‌ల్ రీఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మ‌రోసారి త‌మిళి సై చేస్తున్న ప్రత్యక్ష రాజ‌కీయ‌ ప్రయ‌త్నాలు ఈసారైనా స‌క్సెస్ అవుతాయా లేదా అనేది చూడాలి. ఇక త‌మిళిసై రాజీనామాతో ఇప్పుడు తెలంగాణకు రాబోయే కొత్త గ‌వ‌ర్నర్ ఎవ‌రన్న చ‌ర్చ మొద‌లైంది. లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్రం ఎవరి పేరు ప్రతిపాదిస్తుందని అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Also Read : భయమా? ఒత్తిళ్లా? బీఆర్ఎస్ నేతలు పార్టీ వీడటానికి కారణాలు ఏంటి?