కాకి నమూనాలతో బైక్ పై డాక్టర్ 350 కిలోమీటర్ల ప్రయాణం..అభినందించిన సీఎం

కాకి నమూనాలతో బైక్ పై డాక్టర్ 350 కిలోమీటర్ల ప్రయాణం..అభినందించిన సీఎం

Updated On : January 12, 2021 / 2:23 PM IST

Madhya pradesh vet 350 km on bike with crow samples : మధ్యప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ పరీక్షల కోసం కాకి నమూనాలతో ఓ పశువుల డాక్టర్ ఏకంగా బైక్ మీద 350 కిలోమీటర్లు ప్రయాణించారు. దీంతో సదరు డాక్టర్ వర్క్ పట్ట ఉన్న అంకితభావానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సీఎం కూడా డాక్టర్ ను అభినందించారు.

భారత్ లోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ వైరస్ తో కోళ్లు, కాకులు,బాతులు, నెమళ్లు వంటిపలు పక్షులు చనిపోతున్నాయి. ఈక్రమంలో ఇప్పటికే మధ్యప్రదేశ్లో పలు పౌల్డ్రీ పరిశ్రమల్లో వేలాది కోళ్లు భారీ సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. అంతేకాదు కాకులు కూడా గుట్టలు గుట్టలుగా చచ్చిపడిపోతున్నాయి. మూడు జిల్లాల్లో వారం రోజుల వ్యవధిలోనే వందల సంఖ్యలో కాకులు మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో చనిపోయిన కాకుల నుంచి నమూనాలు సేకరించి భోపాల్ లోని హైసెక్యూరిటీ యానిమల్ డిసీజ్ లాబొరేటరీ (హెచ్ఎస్డీఎల్)కి పంపిస్తున్నారు.

దీంట్లో భాగంగా మధ్యప్రదేశ్ లోని పృథ్వీపూర్ ప్రాంతానికి చెందిన ఆర్‌పీ తివారి అనే 54ఏళ్ల అసిస్టెంట్ పశువైద్యాధికారి చనిపోయిన కాకుల నుంచి నమూనాలను సేకరించి భోపాల్ రావాల్సిందిగా ఉన్నతాధికారులు ఆయనను ఆదేశించారు. కానీ పృథ్వీపూర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉండే టికమ్‌గఢ్ వెళ్లే సరికి అతడు ఎక్కాల్సిన బస్సు వెళ్లిపోయింది. ఆ రాత్రికి రైలు టికెట్లు కూడా దొరక్కపోవడంతో తివారి ఆలోచనలో పడ్డారు. దీంతో డాక్టర్ తివారీ భోపాల్ వెళ్లేందుకు మరో దారి లేకుండాపోయింది. కానీ ఎలాగైనా సనే కాకుల నమూనాలను తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

మరో దారి లేక కొడుకు మోటారు సైకిలుపై వెనక కూర్చుని భోపాల్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు డాక్టర్ తివారి. ఓ పక్క ఎముకలు కొరికే చలిలో నివారి నుంచి 350 కిలోమీటర్లు ప్రయాణించి ఎట్టకేలకు ఆదివారం (జనవరి 10,2021) భోపాల్ చేరుకుని బర్డ్ ఫ్లూ పరీక్షల కోసం కాకి నమూనాలు అందించారు.

నమూనాలు అందించటానికి అంతదూరం బైక్ పై ప్రయాణించిన డాక్టర్ తివారీని ప్రజలు అభినందిస్తున్నారు. అంతేకాదు ఈ విషయం తెలుసుకున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ ద్వారా తివారిని ప్రశంసించారు. ఆయన ఉత్సాహానికి శాల్యూట్ చేస్తున్నట్టు తెలిపారు. డాక్టర్ తివారీ అంకితభావానికి, బలమైన సంకల్పానికి ఆయనో గొప్ప ఉదాహరణ అని కొనియాడారు.