మహాబలిపురంలో ఇద్దరు మహాబలులు కలిశారు. ఒకరు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కాగా…మరొకరు ప్రధాని నరేంద్ర మోడీ. ఇద్దరు నేతలు చారిత్రక కట్టడాలను చూస్తూ ఉల్లాసంగా గడిపారు. మోడీ తమిళ సంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకుంటే జిన్ పింగ్ సాధారణ దుస్తుల్లో సింపుల్ గా ఆలయం మొత్తం కలియతిరిగారు. రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు మహాబలిపురంలో ప్రధాని మోడీ ఘనస్వాగతం పలికారు. మోడీ తమిళనాడు సంప్రదాయం ఉట్టిపడేలా పంచెకట్టులో ఆకర్షించగా….జిన్‌పింగ్ సూటు లేకుండా కాజువల్ డ్రెస్‌లో కనిపించారు.
మహాబలిపురం అంతా కలియ తిరుగుతూ, ఓ గైడ్‌లా అక్కడి విశేషాలను జిన్‌పింగ్‌కి మోడీ వివరించారు. అర్జునుడి తపస్సు చేసిన స్థలాన్ని వీరు సందర్శించారు. పల్లవులు నిర్మించిన వెయ్యేళ్ల నాటి కట్టడాలు, చారిత్రక వైభవం, నిర్మాణాల విశిష్టతను జిన్‌పింగ్‌కు తెలియజేశారు. జిన్‌పింగ్ వెంట సీపీపీ సెంట్రల్ కమిటీ రాజకీయ విభాగం డైరెక్టర్ యంగ్‌జేషీ కూడా ఉన్నారు. మహాబలిపురంలోని శోర్ ఆలయ ప్రాంగణంలో జిన్‌పింగ్, మోడీ కొద్దిసేపు సమావేశమయ్యారు. ఇరువురు నేతలు కొబ్బరిబోండాం సేవిస్తూ అనధికారికంగా పలు అంశాలపై చర్చించారు.
అనంతరం జిన్‌పింగ్, మోడీ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అంతకు ముందు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు చెన్నై విమానశ్రయంలో ఘనస్వాగతం లభించింది. తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి తదితర అధికారులు స్వాగతించారు. వేద మంత్రాల నడుమ జిన్‌పింగ్‌కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జిన్‌పింగ్‌ను స్వాగతించడానికి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తమిళనాడు సాంస్కృతిని ప్రతిబింబింపజేసే ప్రదర్శనలను జిన్‌పింగ్ తిలకించారు. అక్కడి నుంచి ఆయన చెన్నై గిండీ రోడ్డులోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌కు చేరుకున్నారు.
Read More : ల్యాండింగ్ టైంలో స్కిడ్ అయిన మహా సీఎం హెలికాఫ్టర్