శివసేనకు షాక్..ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీని ఆహ్వానించిన గవర్నర్

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం లేదని, సంప్రదింపుల కోసం 48 సమయం ఇవ్వాలని సోమవారం సాయంత్రం శివసేన నాయకులు గవర్నర్ ను కోరారు. అయితే గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి శివసేన అభ్యర్థనను తిరస్కరించిన కాసేపటికే కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మూడో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఎన్సీపీని గవర్నర్ ఆహ్వానించారు. దీనికోసం ఎన్సీపీకి గవర్నర్ 24 గంటల గడువిచ్చారు. దీంతో ఎన్సీపీ నేతలు అజిత్ పవార్, ఛగన్ భుజ్బల్ ఇతర నేతలు రాజ్ భవన్ లో గవర్నర్ తో సమావేశమయ్యారు. శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ముందునుంచి చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ శివసేనకు మద్దతు విషయంలో ఎటూ తేల్చకపోవడంతో మహా రాజకీయాలు ఏ దిశగా వెల్తున్నాయో అర్థంకావట్లేదు.