Rain Deaths: వర్షాలకు 136 మంది మృతి.. రెడ్ అలర్ట్!

మహారాష్ట్రలో గత రెండు రోజులలో వర్షం సంబంధిత సంఘటనలు మరియు కొండచరియలు విరిగిపడడం వల్ల బీభత్సం క్రియేట్ అయ్యింది. ఈ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో భారీ ప్రాణనష్టం వాటిల్లింది.

Maharashtra Rains: మహారాష్ట్రలో గత రెండు రోజులలో వర్షం సంబంధిత సంఘటనలు మరియు కొండచరియలు విరిగిపడడం వల్ల బీభత్సం క్రియేట్ అయ్యింది. ఈ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలోని పలుచోట్ల వేర్వేరు ఘటనల్లో రెండు రోజుల వ్యవధిలోనే దాదాపు 136 మంది చనిపోయారు. ఒక్క రాయ్‌గఢ్‌ జిల్లా మహద్‌ తహసీల్‌ పరిధిలోని తలావి గ్రామంలోనే కొండచరియలు విరిగి పడి 47మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో వర్షాల వల్ల సంభవించిన మరణాల్లో అత్యధికం రాయ్‌గఢ్‌, సతారా జిల్లాల్లోనే నమోదైంది. కొండచరియలు విరిగిపడటంతో పాటు అనేక మంది ప్రజలు వరదనీటిలో కొట్టుకుపోయారు. పశ్చిమ మహారాష్ట్రలోని సతారాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో 27 మంది మృతిచెందినట్టు పేర్కొన్నారు. అలాగే, మహారాష్ట్రలోని తూర్పు జిల్లాలైన గోండియా, చంద్రాపూర్‌ జిల్లాల్లోనూ కొన్ని మరణాలు నమోదైనట్టు చెబుతున్నారు.

భారీ వర్షాలు కొనసాగుతున్నందున పశ్చిమ మహారాష్ట్రలోని పూణే డివిజన్ పరిధిలోని 84,452 మందిని శుక్రవారం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 40,000 మందికి పైగా కొల్లాపూర్ జిల్లాకు చెందినవారు. కొల్హాపూర్ పట్టణానికి సమీపంలో ఉన్న పంచగంగా నది 2019 వరదలకు మించి ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ శుక్రవారం సాయంత్రం సతారా జిల్లాకు కొత్త రెడ్ అలర్ట్ జారీ చేసింది, జిల్లాలోని పర్వత ఘాట్స్ ప్రాంతంలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. గత 48 గంటల్లో మహారాష్ట్రలో మరణించిన వారి సంఖ్య 136కు చేరుకుందని ఓ అధికారి తెలిపారు. మరణాలు చాలావరకు రాయ్‌ఘడ్ మరియు సతారా జిల్లాల నుంచే సంభవిస్తున్నాయి. కొండచరియల్లోనే కాకుండా, చాలా మంది ప్రజలు వరద నీటిలో కొట్టుకుపోయారు.

సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ మూడు బృందాలు పనిచేస్తున్నాయి. ఇదిలావుండగా, కొండచరియలు విరిగిపడి మరణించిన వారి బంధువులకు మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ .5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో, ప్రాణనష్టం గురించి విచారం వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆర్థిక సహాయం ప్రకటించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించాలని.. అందరిని పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు కేంద్రమంత్రి అమిత్‌ షా కూడా వరదలతో కొట్టుమిట్టాడుతున్న మహారాష్ట్రకు తగినంత సాయం చేస్తామని ప్రకటించారు. కొండ చరియలు విరిగిపడిన ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షల సాయం ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు