Malayalam actor Dileep
Malayalam actor Dileep : ఎనిమిదేళ్ల క్రితం మలయాళ నటి కిడ్నాప్, ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన కేసు కేరళలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా.. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన ప్రముఖ నటుడు దిలీప్‌కు భారీ ఊరట లభించింది. కేరళలోని ఎర్నాకుళం కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే, ఇదే కేసులో అత్యాచారం, కుట్ర వంటి నేరాల కింద ఆరుగురిని న్యాయస్థానం దోషులుగా ప్రకటించింది.
కేరళలోని కొచ్చిలో సెషన్స్ జడ్జి హనీ ఎం.వర్గీస్ ఈ కేసును విచారించారు. ఈ కేసు ఎనిమిదేళ్లుగా పెండింగ్ లో ఉంది. నటి అత్యాచార కేసులో దిలీప్ ఎనిమిదో నిందితుడు. ఈ కేసులో దిలీప్ సహా ఇద్దరిని కేరళ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అత్యాచారం, కుట్ర వంటి నేరాల కింద ఆరుగురిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది.
అసలేం జరిగిందంటే..?
2017 ఫిబ్రవరి 17న మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో నటించిన ప్రముఖ నటి కిడ్నాప్‌నకు గురైంది. కొచ్చిలో ఈ ఘటన జరిగింది. ఆ రోజు రాత్రి రెండు గంటలపాటు ఆమెను తన కారులోనే లైంగిక వేధింపులకు గురిచేసిన దుండగులు, తరువాత అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, ఈ కేసులో 10మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో మళయాలం ప్రముఖ నటుడు దిలీప్ కూడా ఒకరు. 2017లో ఈ కేసుకు సంబంధించి తొలి ఛార్జిషీట్ నమోదైంది. అదే ఏడాది జులై నెలలో దిలీప్ అరెస్టయ్యాడు. నాలుగు నెలల తరువాత అతనికి బెయిల్ మంజూరు అయింది.
సిబీఐ విచారణకు డిమాండ్..
నటిపై వేధింపులు, కిడ్నాప్ వ్యవహారం కేసులో దిలీప్ సీబీఐ విచారణకు డిమాండ్ చేశాడు. కేరళ పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆయన.. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారు. అయితే, ఆ అభ్యర్ధన తిరస్కరణకు గురైంది.
ఇదిలాఉంటే.. దోషులుగా తేల్చిన ఆరుగురికి డిసెంబర్ 12న కోర్టు శిక్షను విధించనుంది. దిలీప్‌ను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు.. అందుకు గల కారణాన్ని ఇంకా బహిరంగపర్చలేదు. డిసెంబర్ 12న దోషులకు శిక్షను ఖరారు చేసిన తరువాత కోర్టు తన తీర్పుకు సంబంధించిన అన్ని పత్రాలను బహిరంగపర్చే అవకాశం ఉంది.