పశ్చిమ బెంగాల్లో పాగా వేసేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ రాష్ట్రంలో దూసుకుపోతున్న బీజేపీని నిలువరించేందుకు తృణమూల్ కాంగ్రెస్ కొత్త కార్యక్రమం చేపట్టింది. ఢిల్లీలో CAA వ్యతిరేక నిరసనకారులపై కేంద్రం జరిపిన హింసాకాండను వ్యతిరేకిస్తూ.. ‘బిజెపి ఛీఛీ పేరుతో’ ర్యాలీని చేపట్టనున్నట్లు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.
శుక్రవారం మార్చి6న రాష్ట్ర్రంలోని అన్ని బ్లాకుల్లో తృణమూల్ కాంగ్రెస్ ఈ ప్రదర్శన చేపట్టనున్నట్లు దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలో బుధవారం జరిగిన సమావేశంలో ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలో అమాయక ప్రజానీకాన్ని హతమార్చేందుకు, మారణహోమం సృష్టించేందుకు ఇతర ప్రాంతాల నుండి బిజెపి గూండాలను రప్పించిందని ధ్వజమెత్తారు.
ఈ హింసాకాండకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మమత అన్నారు. సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్ వంటి ప్రజా వ్యతిరేక చట్టాలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు యత్నిస్తున్న మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా, కార్యక్రమంలో ప్రచారం మొత్తం ‘ఛీ ఛీ’ నినాదాలతో ఉంటుందని… పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, జాతీయ జనాభా పట్టికను ఉపసంహరించుకోవాలని, జాతీయ పౌర పట్టికను రద్దు చేయాలని ఈ కార్యక్రమంలో పేర్కొంటామని ఆమె తెలిపారు. దేశాన్ని విడదీయాలనుకునే వారికి ఈ దేశంలో స్థానం లేదు’’ అని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.(బాల్య వివాహాన్ని ఆపిన 13 ఏళ్ళ చిన్నారి : అవార్డుతో సత్కరించనున్న సీఎం యోగి)
మోడీ సర్కార్‌వి విద్వేష పూరితమైన వ్యర్థ రాజకీయాలని, ఇలాంటి విధ్వంస కారులకు దేశంలో చోటు లేదని దుయ్యబట్టారు. తొలుత ఢిల్లీ హింసాకాండను నియంత్రించాలని, ఆ తరువాత బెంగాల్‌పై దృష్టి పెట్టాలని మమతా బెనర్జీ అన్నారు. హిందువులంటూ జపం చేసే మోడీ సర్కార్, అస్సాంలో మాత్రం ‘హిందు హఠావో’ కార్యక్రమాన్ని చేపట్టారని ఎద్దేవా చేశారు. అస్సాంలో గిరిజనులను హింసించడంతో పాటు జార్ఖండ్‌లో గిరిజనులను వారి భూముల నుండి వెళ్లగొట్టిందని విమర్శించారు. గోలీమారో అంటూ తమ రాష్ట్రంలో బహిరంగంగా నినాదాలు చేయడానికి వారికి ఎంత ధైర్యమని ప్రశ్నించారు.