Karge as PM Face for INDIA: 2024 ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలు కూటమైతే కట్టాయి కానీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఢికొట్టే నాయకుడెవరని మాత్రం స్పష్టం చేయలేదు. అంటే కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారు? ఒకవేళ మోదీ మీద పోటీని ప్రాధాన్యంగా తీసుకుంటే, ఎవరిని నిలబెడతారు? కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థెవరనే ప్రశ్నలకు ఇంకా స్పష్టత రాలేదు. ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కూటమి నాయకత్వంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అయితే ఇదే విషయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానం ఇస్తూ.. తమ కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేను ప్రతిపాదించినట్లు ఆమె వెల్లడించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినట్లు కూడా ఆమె వెల్లడించారు. వాస్తవానికి కూటమి నాలుగో సమావేశం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని అభ్యర్థిపై మమతా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టడం ఆసక్తికరంగా మారింది.
#WATCH | On PM face for INDIA bloc, TMC’s Mamata Banerjee says, “I have proposed Congress President Mallikarjun Kharge’s name. Arvind Kejriwal supported my proposal.” pic.twitter.com/73pS7xTPrW
— ANI (@ANI) December 20, 2023
ఇండియా కూటమి నుంచి ప్రధాని రేసులో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉన్నారు. వాస్తవానికి మమతా కూడా ప్రధాని అభ్యర్థేనని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ త్రిపుర, గోవా అసెంబ్లీ ఎన్నికల తర్వాత మమత తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. అయితే నాలుగో సమావేశంలో ఇండియా కూటమి కన్వీనర్ ఎవరిని సహా ప్రధాని అభ్యర్థిపై స్పష్టతకు రావాలని కూటమి నేతలు భావిస్తున్నారు. అయితే దీనికి ముందే ఖర్గేను తాను ప్రతిపాదించినట్లు మమత చెప్పి, కూటమిలో కొత్త చర్చకు దారి తీశారు.