Manmohan Singh: మన్మోహన్ సింగ్ తన ఆఖరి ప్రెస్‌మీట్‌లో అలా ఎందుకన్నారు..?

మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Manmohan Singh: మన్మోహన్ సింగ్ తన ఆఖరి ప్రెస్‌మీట్‌లో అలా ఎందుకన్నారు..?

manmohan Singh press conference (File Photo)

Updated On : December 27, 2024 / 12:14 PM IST

Manmohan Singh Passes Away: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల రాజకీయ ప్రముఖులు, పలు రంగాల ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ ఆయనతో తమకున్న అనుభవాలను గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి హోదాలో తన చివరి విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పలుసార్లు చర్చనీయాంశమైయ్యాయి.

Also Read: Manmohan Singh: ఒరాక్ ఒబామా తాను రాసిన పుస్తకంలో మన్మోహన్ సింగ్ గురించి ఏమన్నారో తెలుసా?

2014 జనవరి 3వ తేదీన ప్రధాన మంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ తన చివరి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పలు సందర్భాల్లో చర్చనీయాంశమైయ్యాయి. ఆ మీడియా సమావేశంలో ఓ జాతీయ మీడియాకు చెందిన జర్నలిస్టు మన్మోహన్ సింగ్ ను ప్రశ్నిస్తూ.. మీ కేబినెట్ లోని మంత్రులను అదుపులో ఉంచుకోలేకపోవడం, అనేక సందర్భాల్లో వారిపై చర్య తీసుకోవడానికి వెనుకడుగు వేయడం గురించి ప్రశ్నించారు. దీనికి మన్మోహన్ సింగ్ చిరునవ్వుతో స్పందిస్తూ.. సమకాలీన మీడియా కంటే, పార్లమెంటులోని ప్రతిపక్ష పార్టీల కంటే చుట్టూ ఉన్న పరిస్థితుల ఆధారంగా నేను పనిచేసుకుంటూ వెళ్లాను. అందువల్ల నేను చేసింది తప్పా, ఒప్పా అన్నది చరిత్ర చెబుతుందని నేను నిజాయితీగా నమ్ముతాను అని అన్నారు. ప్రభుత్వ క్యాబినెట్లో జరిగే అన్ని విషయాలను నేను వెల్లడించలేను. పరిస్థితులు, సంకీర్ణ రాజకీయాల పరిణామాలను పరిగణలోకి తీసుకొని ఆ పరిస్థితుల్లో నేను చేయగలిగినంత ఉత్తమంగా చేశానని నేను భావిస్తున్నానని అన్నారు. ఇదిలాఉంటే.. యూపీఏ-1, యూపీఏ-2 హయాంలోనూ ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ కొనసాగిన విషయం తెలిసిందే. అయితే, యూపీఏ-2 హయాంలో పలు శాఖల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చెందడానికి, నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ అధికారంలోకి రావడానికి కీలక కారణాలుగా రాజకీయ విశ్లేషకులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు.

Also Read: Manmohan Singh: ఆ సమయంలో డబ్బుల్లేక పస్తులున్న మన్మోహన్ సింగ్.. పీఎం హోదాలో కీలక నిర్ణయాలు

మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని శుక్రవారం ఉదయం ఆస్పత్రి నుంచి తన నివాసానికి తీసుకెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డాతోపాటు లోక్ సభలో ప్రతిపక్ష పార్టీ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఇతర రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాల ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఇదిలాఉంటే.. మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని శనివారం (డిసెంబర్ 28న) ఉదయం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్తారు. అనంతరం ఉదయం 10గంటల తరువాత రాజ్ ఘాట్ దగ్గర ప్రభుత్వ లాంఛనాలతో మాజీ ప్రధాని పార్ధీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.