లాక్ డౌన్‌ను సీరియస్‌గా పట్టించుకోవడం లేదేం: మోడీ

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా భారత్‌లోనూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సోమవారం నాటికి 419 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మరణాల సంఖ్య ఎనిమిదికి చేరింది. మరోవైపు లాక్ డౌన్ అమలుపై దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ట్విటర్‌ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రధాని అన్నారు. విధిగా ఆరోగ్య సూచనలు పాటించాలని సూచించారు.

‘లాక్‌డౌన్ పైన  నిర్లక్ష్యం పనికిరాదు. ఎందుకని ప్రకటించామో గుర్తించాలి. తీవ్రంగా పరిగణించి ప్రతి ఒక్కరూ విధిగా నియమాలు పాటించాలి. అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని’ మోడీ ట్వీట్ చేశారు. మరోవైపు మహమ్మారి ప్రభావం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ అన్ని పరిశ్రమలతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. 

సోమవారం సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేం‍ద్రం ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలను ఉ‍ల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దేశవ్యాప్తంగా దాదాపు 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 

ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ మార్చి 31వరకు కొనసాగనుంది. అన్ని మెట్రో, రైళ్లు, ఇతర రవాణా సౌకర్యాలను మార్చి 31 వరకు నిలిపివేయగా, అత్యవసర సరుకులు, మందుల కొరత రాకుండా ఆయా ప్రభుత్వాలు సంబంధిత చర్యలను తీసుకుంటున్నాయి. మిల్క్ డెయిరీ, కిరాణా షాపులు, పెట్రోల్ పంపులు లాంటి అవసరమైన సేవలు మాత్రమే ప్రజల సౌలభ్యం కోసం తెరిచి ఉంటాయి. 

See Also | దేశమంతా షట్ డౌన్.. బయట కనిపిస్తే లోపలెయ్యండి: రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు