శివమొగ్గలో భారీ పేలుడు..10 మంది మృతి, 50 కి.మీటర్ల వరకు భూ ప్రకంపనలు

Shivamogga kills 10 : క‌ర్ణాట‌క‌ రాష్ట్రంలోని శివమొగ్గలో భారీ పేలుడు కలకలం రేపింది. 2021, జనవరి 21వ తేదీ గురువారం రాత్రి అబ్బలగిరె గ్రామ సమీపంలో జరిగిన ఈ పేలుడు ఘటనలో 10 మంది చనిపోయారు. ప‌లువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్వారీలో ఉప‌యోగించే పేలుడు ప‌దార్థాల‌ను త‌ర‌లిస్తుండ‌గా ఈ విషాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

రాత్రి కావడంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడ్డాయని తెలుస్తోంది. తమ వారు చనిపోయారన్న విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పేలుడు ధాటికి 50 కి.మీటర్ల పరిధిలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంపం వచ్చిందేమోనన్న భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. చిక్ మంగుళూరులోనూ భూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు వెల్లడించారు. శివమొగ్గ నుంచి చిక్ మంగుళూరు వరకు రాత్రంతా రోడ్లపైనే జనం జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేలుళ్ల శబ్దాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.