India Name Row: లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశం పేరు మార్చే రాజకీయాలు జోరందుకున్నాయి. ఇండియా పేరుతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దాడులు చేసుకుంటున్నారు. ఇండియా అనే పేరు బానిస మనస్తత్వానికి ప్రతీకని అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు పేర్కొంటుంటే, ప్రతిపక్ష పార్టీలేమో ‘ఇండియా’ కూటమికి కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని అంటున్నాయి. ఇక ఈ వివాదం మధ్య, బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి స్పందిస్తూ అటు అధికార భారతీయ జనతా పార్టీ, ఇటు ప్రధాని విపక్షం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇండియా వర్సెస్ భారత్ అనే అంశంపై ఇప్పుడు రెండు పార్టీలు, ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. దేశం పేరు మార్చే ముందు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే.. ప్రతిపక్షాలు తమ సంస్థకు ఇండియా అని పేరు పెట్టినప్పుడు దాన్ని నిషేధించాల్సిందని అన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలి లేదా చట్టం తీసుకొచ్చి నిషేధించి ఉండాల్సిందని అన్న ఆమె.. దీనిపై ఇద్దరూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశం పేరుతో ఇలాంటి రాజకీయాలు చేయడం ఏమాత్రం సరికాదని హితవు పలికారు. సుప్రీంకోర్టు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
‘‘బీజేపీ అయినా లేదా ప్రతిపక్షాలు తమ కూటమికి దేశం పేరు పెట్టడం ద్వారా దేశం పేరుతో రాజ్యాంగాన్ని తారుమారు చేయడానికి అవకాశం ఇచ్చాయి. అధికార పక్షం లేదా ప్రతిపక్షం అంతర్గత సహకారంతోనే ఇదంతా జరిగినట్లు కనిపిస్తోంది. ఇది కూడా సాధారణ చర్చ. దాన్ని ఎంత ఎక్కువగా ఖండించినా తక్కువే’’ అని మాయావతి అన్నారు. ఏ కూటమికి దేశం పేరు పెట్టకూడదని, ఇది దేశ ప్రతిష్టపై ప్రభావం చూపుతుందని మాయావతి అన్నారు. ఏది జరిగినా ప్రభుత్వం, ప్రతిపక్షాలు కావాలనే చేస్తున్నాయని ఆమె దుమ్మెత్తి పోశారు.