Media Tree in Coimbatore : కోయంబత్తూరులో ఆకట్టుకుంటున్న మీడియా ట్రీ .. సెల్ఫీలతో సందడి చేస్తున్న నగరవాసులు

కోయంబత్తూరులో మీడియా ట్రీ ఆకట్టుకుంటోంది. ఇక్కడ ఉచితంగా వైఫై తో పాటు వీనుల విందైన మ్యూజిక్ కూడా వినొచ్చు. మ్యూజిక్ తో పాటు రంగురంగుల విద్యుద్దీపాల కాంతుల్లో వెలుగులీనుతున్న నిర్మాణం నగరవాసులను ఆకట్టుకుంటోంది.

Media Tree in Tamil Nadu Coimbatore

Media Tree in Tamil Nadu Coimbatore : తమిళనాడు( Tamil Nadu)లోని కోయంబత్తూరు(Coimbatore)లో మీడియా ట్రీ (Media Tree)ఆకట్టుకుంటోంది. స్మార్ట్‌ సిటీ పథకం కింద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ మీడియా ట్రీ అందరికి ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి పథకాల్లో భాగంగా మీడియా ట్రీని ఏర్పాటు చేశారు. దాదాపు 11-మీటర్ల ఎత్తైన మెటాలిక్ స్టీల్ టవర్ LED స్క్రీన్‌తో నిర్మించబడింది. దీనినే ‘మీడియా ట్రీ’గా పిలుస్తున్నారు.

మోడల్ రోడ్లను అభివృద్ధి చేసేందుకు చేపట్టిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టు(Smart City project)లో భాగంగా రేస్‌కోర్సు రోడ్డు(Racecourse Road )లో రెడ్‌ఫీల్డ్‌ ప్రాంతంలోని థామస్ పార్క్ జంక్షన్ వద్ద ఈ టవర్ ను నిర్మించారు. దాదాపు 11 మీటర్ల ఎత్తు, 1.70 మీటర్ల వెడల్పుతో ఈ మీడియా టవర్‌ నిర్మించారు. దీనిని కార్పొరేషన్‌ అధికారులు ఆదివారం (ఆగస్టు 13,2023)రాత్రి ప్రారంభించారు.

టవర్‌ వద్ద ఉచితంగా వైఫై సదుపాయం పొందవచ్చు. అంతేకాదు వీనుల విందైన మ్యూజిక్ కూడా వినొచ్చు. మ్యూజిక్ తో పాటు రంగురంగుల విద్యుద్దీపాల కాంతుల్లో వెలుగులీనుతున్న నిర్మాణం నగరవాసులను ఆకట్టుకుంటోంది. ఈ టవర్ వద్దకు స్థానికులు పెద్ద ఎత్తున వీక్షించటానికి వస్తున్నారు. సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. దారి వెంట వెళ్లే వారు కూడా అక్కడ ఆగి ఫోటోలు, సెల్ఫీలతో సందడి చేస్తున్నారు.

ఎల్ ఈడీ స్క్రీన్ ను కలిగి ఉన్న ఈ టవర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తుంది. పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ వంటి విషయాలపై ప్రజా ప్రచారాలకు సంబంధంచిన సందేశాలను ప్రదర్శిస్తుంది. స్క్రీన్‌పై ప్రదర్శించబడే కంటెంట్ నేరుగా RS పురం ప్రాంతంలోని కోయంబత్తూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ (CCMC) భవనంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ (ICCC) నుండి నియంత్రించబడుతుంది.

కోయంబత్తూర్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ (CSCL) షేర్ చేసిన సమాచారం ప్రకారం.. ‘మీడియా ట్రీ’ పైభాగంలో 360-డిగ్రీల వంపు తిరిగి ఉన్న LED డిస్‌ప్లే “నేక్డ్ ఐ 3D డిస్‌ప్లే ఉంటుంది. ఇది భారతదేశంలోనే తొలిసారిగా పబ్లిక్ ప్లేస్ లో ఏర్పాటు చేసిన విధానం కావటం గమనించాల్సిన విషయం.