IAS Saumya Jha: ఇలాంటి ఆఫీసర్లు ఉంటే సమాజంలో సమస్యలే ఉండవు.. AIతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి.. ఇప్పుడు..

ఇలాంటి అధికారుల నాయకత్వంలో మన దేశ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

IAS Saumya Jha

సమాజంలో నిజమైన మార్పు కొందరితోనే సాధ్యమవుతుంది. అలాంటి ఒక మార్పుకు శ్రీకారం చుట్టారు 2017 బ్యాచ్ IAS అధికారిని సౌమ్యా ఝా. రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా కలెక్టర్‌గా ఆమె ప్రారంభించిన ‘పఢాయ్ విత్ AI’ (Padhai with AI) కార్యక్రమం ప్రభుత్వ పాఠశాల విద్యలో ఒక విప్లవాన్ని సృష్టిస్తోంది.

సౌమ్యా ఝాకు మొదట కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. టోంక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించినప్పుడు సౌమ్యా ఝా విద్యార్థులు కంటున్న కలలకు, వారి ముందు ఉన్న వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న తేడాను గుర్తించారు.

మొదట ఆమె పిల్లల్లో ఉన్న కొన్ని సమస్యలను గుర్తించారు. వీటి గురించి మాట్లాడుతూ.. “పిల్లల్లో పెద్దయ్యాక డాక్టర్లు, టీచర్లు కావాలన్న కలే కాదు… AI నిపుణులుగా, రోబోటిక్స్ ఇంజనీర్లుగా, డ్రోన్ ఆపరేటర్లుగా మారాలన్న లక్ష్యాలు కూడా ఉన్నాయి. కానీ, లెక్కలంటే భయంతో చాలామంది సైన్స్ గ్రూపును ఎంచుకోవడానికి వెనుకాడుతున్నారు” అని సౌమ్యా ఝా తెలిపారు.

ఇవే కాకుండా మరికొన్ని సమస్యలు ఆమె దృష్టికి వచ్చాయి. అధికారిక పనుల వల్ల టీచర్లు తరచుగా క్లాసులకు హాజరు కాలేకపోవడం, పంటల సీజన్‌లో విద్యార్థులు పొలం పనులకు వెళ్లడంతో చదువు మధ్యలోనే ఆగిపోవడం వంటివి గుర్తించారు. ఈ సవాళ్లను అధిగమించడానికే ఆమె ‘పఢాయ్ విత్ AI’ అనే వినూత్న ప్రాజెక్టుకు జీవం పోశారు.

‘పఢాయ్ విత్ AI’ ఎలా పనిచేస్తుంది?
ఈ కార్యక్రమానికి గుండెకాయ లాంటిది ఒక AI-ఆధారిత ట్యూటర్. ఇది ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు లెక్కలు (Maths), సైన్స్ వంటి కఠినమైన సబ్జెక్టులలో సాయం చేస్తుంది.

24/7 అందుబాటు: విద్యార్థులకు ఎప్పుడు సందేహం వచ్చినా వెంటనే సమాధానం ఇస్తుంది. హిందీ, ఇంగ్లిష్ భాషలలో పాఠాలను వివరిస్తుంది. ఒకే ప్రశ్నకు విద్యార్థికి అర్థమయ్యే వరకు రకరకాలుగా వివరిస్తుంది. టీచర్లు సులభంగా ప్రాక్టీస్ టెస్టులు పెట్టడానికి, విద్యార్థుల ప్రతిభను ట్రాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

క్షేత్రస్థాయిలో ఆమె చేసిన పరిశీలనల నుంచే ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. 2024 సెప్టెంబర్‌లో మొదటి దశ, 2025 జనవరిలో బెటర్ వెర్షన్ 2 ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్ ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలోని 353 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా నడుస్తోంది. 11,000 మందికి పైగా విద్యార్థులు ఈ AI ట్యూటర్ ద్వారా ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు.

ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులలో లెక్కలపై భయం పోయి, ఫలితాలు మెరుగుపడ్డాయి. బాగా రాణిస్తున్న విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా మిగతా వారిలో స్ఫూర్తి నింపుతున్నారు.

IAS సౌమ్యా ఝా ప్రారంభించిన ‘పఢాయ్ విత్ AI’ కేవలం ఒక టెక్నాలజీ ప్రయోగం కాదు. ఇది గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిచ్చే ఒక అద్భుత ప్రోగ్రాం. ఇలాంటి అధికారుల నాయకత్వంలో మన దేశ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.