మేఘాలయ హనీమూన్ హత్య కేసు.. పెళ్లి తరువాత, హనీమూన్‌కు వెళ్లేముందు ఏం జరిగిందో సంచలన విషయాలు బయటపెట్టిన రఘువంశీ కుటుంబం

రాజా రఘువంశీ, సోనమ్‌కు పెళ్లి జరిగిన తరువాత, వారు హనీమూన్‌కు వెళ్లే ముందు జరిగిన సంఘటనలను అశోక్ రఘువంశీ వెల్లడించారు.

Meghalaya honeymoon case

Meghalaya Honeymoon Case: మధ్యప్రదేశ్‌కు చెందిన కొత్త జంట రాజా రఘువంశీ, సోనమ్‌ల హనీమూన్‌ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా సోనమ్‌ను, అమె ప్రియుడు రాజ్ కుష్వాహా, ఇతర నిందితులను మేఘాలయ పోలీసులు సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు.. నేరం జరిగిన తీరును తెలుసుకునేందుకు పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. మరోవైపు.. రాజా రఘువంశీ హత్యకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను బయటపెట్టారు.

Also Read: ప్రియుడుతో పెళ్లి కూతురు పరార్.. ‘హమ్మయ్య.. బతికించింది..’ అంటూ పెళ్ళికొడుకు హ్యాపీ

రాజా రఘువంశీ, సోనమ్‌కు పెళ్లి జరిగిన తరువాత, వారు హనీమూన్‌కు వెళ్లే ముందు జరిగిన సంఘటనలను గురించి రాజా తండ్రి అశోక్ రఘువంశీ మీడియాకు వివరించారు. దంపతులు హనీమూన్‌కు వెళ్లేముందు జరిగిన ఒక ఘటన గురించి చెబుతూ.. సోనమ్ పట్టుబట్టడంతో ఇంటి ప్రధాన ద్వారంకు కొన్నిపదార్థాలతో కూడిన ఓ కట్ట లాంటి వస్తువును రాజా రఘువంశీ వేలాడదీశాడని, అది ఇంటిని చెడు నుంచి కాపాడుతుందని ఆమె అతనికి చెప్పిందని.. అయితే, రఘువంశీ హత్య తరువాత అది అదృశ్యమైందని చెప్పాడు. ఆమె నా కొడుకుపై ఏదో ఒక రకమైన చేతబడిని ప్రయోగించిందని నాకు ఇప్పుడు అర్ధమవుతుందని, దోషులను ఉరితీయాలంటూ అశోక్ రఘువంశీ డిమాండ్ చేశాడు.

రాజా రఘువంశీ సోదరుడు సచిన్ రఘువంశీ మాట్లాడుతూ.. ఈ హత్య ముందస్తు ప్రణాళికతో జరిగిందని.. క్షుద్ర పూజలతో జరిగిన నరబలి అంటూ పేర్కొన్నాడు. క్షుద్ర పూజల ద్వారా సోనమ్ అనారోగ్యంతో ఉన్న తన తండ్రి ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు నా సోదరుడిని బలిచ్చిందని ఆరోపించాడు.

రాజా రఘువంశీ తల్లి ఉమా మాట్లాడుతూ.. తన కుమారుడు, సోనమ్ ‘మాంగ్లికులు’. వధువు కుటుంబానికి చెందిన జ్యోతిష్యుడు సూచించిన ముహూర్తం ప్రకారం వారు సంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్నారని చెప్పారు. సోనమ్ వివాహం తరువాత మా ఇంట్లో నాలుగు రోజులు మాత్రమే ఉంది. సంప్రదాయం ప్రకారం ఆమె తల్లి ఇంటికి వెళ్లింది. మేము ఆమెను సంతోషంగా ఆమె తల్లి ఇంటికి పంపించాము. నేను ఆమెను ఎప్పుడైనా కలిస్తే.. ఆమె నా కొడుకును ఎందుకు చంపిందని అడుగుతాను అంటూ ఉమా పేర్కొంది.